బీజేపీని చూసి కేసీఆర్ భయపడుతుండు : వివేక్ వెంకటస్వామి

బీజేపీని చూసి కేసీఆర్ భయపడుతుండు : వివేక్ వెంకటస్వామి

బీజేపీని చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నడని బీజేపీ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని, బీజేపీ అధికారంలోకి రావాలని జనం కోరుకుంటున్నరని అన్నారు. మోడీ చేస్తున్న అభివృద్ధి చూసి ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. వీ6 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.  బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని, అది చూసి పార్టీ నేతల్లో జోష్ మరింత పెరుగుతోందని అన్నారు. బైక్ యాత్రల ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని వివేక్ వెంకటస్వామి చెప్పారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనని వివేక్ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. ఎనిమిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండని మండిపడ్డారు. కనీసం ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కూడా సరిగా కట్టివ్వలేదని విమర్శించారు. 

కాళేశ్వరంతో వాళ్లే బాగుపడ్డరు

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్టర్లు బాగుపడ్డారే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేసీఆర్ కుటుంబం, మేఘా కృష్ణారెడ్డి మాత్రమే బాగుపడ్డారని మండిపడ్డారు. తాడిచర్ల గనుల్లో రూ.20కోట్ల స్కాం జరిగిందని దానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఉచితంగా ఎరువు ఇస్తానని మోసం చేసిన ముఖ్యమంత్రి.. ఉద్యోగాల భర్తీ విషయం మర్చిపోయాడని, రైతుల కోసం రాష్ట్రంలో కనీసం ఫసల్ బీమా అమలు చేయడం లేదని వాపోయారు. అవినీతికి పాల్పడినందునే రాష్ట్రంలోకి సీబీఐ రావద్దని అంటున్నారని, తప్పు చేయనప్పుడు భయమెందుకని వివేక్ ప్రశ్నించారు. 

సింగరేణిపై తప్పుడు ప్రచారం

సింగరేణి ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని వివేక్ వెంకటస్వామి అన్నారు. సింగరేణిని కేసీఆర్ నాశనం చేసిండని ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని సైతం కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీలో సొంత నిర్ణయాలుండవన్న వివేక్.. హైకమాండ్ నిర్ణయాలే ఫైనల్ అని అన్నారు. బీజేపీ ఏ పార్టీని చూసి భయపడదని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉంటుందని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

ఫాంహౌస్ కేసు కేసీఆర్ స్కెచ్

మొయినాబాద్ ఫాం హౌస్ కేసుపైనా వివేక్ వెంకటస్వామి స్పందించారు. ఫాం హౌస్ కేసు కేసీఆర్ స్కెచ్ లో భాగమని, పోలీసులు సీఎం చేతిలో తోలుబొమ్మలుగా మారారని విమర్శించారు. తెలంగాణపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ కేసీఆర్ ఉద్యమకారులనే పట్టించుకోవడం లేదని వివేక్ వెంకటస్వామి వాపోయారు.