
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ డా. వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని రాష్ట్రపతి ముర్మును వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ స్థాపించి 50 ఏళ్లు పూర్తైందని రాష్ట్రపతికి వివరించారు. 1973లో అప్పటి రాష్ట్రపతి వివి గిరి ప్రారంభించారని తెలిపారు.
పేద విద్యార్థులకు క్యాపిటేషన్ ఫీజు లేకుండా.. కార్పొరేట్ విద్యకు ధీటుగా నాణ్యమైన విద్య అందాలన్నదే తమ తండ్రి కాకా వెంకటస్వామి స్వప్నమని చెప్పారు. ఆయన ఆశయ సాధన దిశగా కాకా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ పయనిస్తున్నాయని వివరించారు. రెండేళ్ల క్రితం ఇంటర్మీడియట్ లో 2,4,7,8 ర్యాంకులు, ఎల్ఎల్ఎమ్ లలో అగ్రభాగంలో అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ విద్యార్థులు నిలిచారని తెలిపారు.