ఆయుష్మాన్ స్కీమ్ పరిమితిని పెంచాలని కేంద్రాన్ని కోరుతా

ఆయుష్మాన్ స్కీమ్ పరిమితిని పెంచాలని కేంద్రాన్ని కోరుతా

కూకట్​పల్లి, వెలుగు: పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ప్రవేశపెట్టిందని, దీని ద్వారా రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్ మెంట్ పొందవచ్చని మాజీ ఎంపీ, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఈ స్కీమ్ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరుతానని తెలిపారు. రాష్ట్ర సర్కార్ కరోనా టైమ్ లో ఈ స్కీమ్ అమలు చేయకపోవడం వల్ల, చాలామంది పేదలు నష్టపోయారన్నారు. ఆదివారం హైదరాబాద్ అల్లాపూర్ డివిజన్ లోని రాజీవ్​గాంధీనగర్​లో స్వచ్ఛ భారత్ అభియాన్​సంస్థ చైర్మన్, బీజేపీ కూకట్​పల్లి నియోజకవర్గ ఇన్ చార్జ్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్‌కు వివేక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఫ్రీ హెల్త్ క్యాంపులు పేదలకు ఎంతో ఉపయోగపడతాయని వివేక్ అన్నారు. కరోనా కష్ట కాలంలో ‘‘సేవా భారతి’’​ సంస్థ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలోనూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. పేదలకు సేవలందించేందుకే స్వచ్ఛ భారత్ అభియాన్ సంస్థను ప్రారంభించానని కాంతారావు చెప్పారు. ప్రజలకు బీజేపీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అర్బన్​అధ్యక్షుడు పన్నాల హరీశ్​రెడ్డి అన్నారు. మూసాపేట కార్పొరేటర్ మహేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.