కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డిపై .. మనీలాండరింగ్ కేసు పెట్టాలి: వివేక్ వెంకటస్వామి

కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డిపై .. మనీలాండరింగ్ కేసు పెట్టాలి: వివేక్ వెంకటస్వామి
  • కాళేశ్వరం కమీషన్లే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్​కు చేరినయ్
  • వాళ్లిద్దరిపై ఈడీ కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేయాలి: వివేక్ వెంకటస్వామి 
  • మందమర్రి, చెన్నూర్​లో  పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి 
  • గడ్డం వంశీకృష్ణతో కలిసి పర్యటన 

కోల్​బెల్ట్​, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్, కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిపై ఈడీ వెంటనే మనీలాండరింగ్ కేసు పెట్టి ఎంక్వైరీ చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. కాళేశ్వరం కమీషన్లే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్​కు చేరాయని ఆయన మండిపడ్డారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, చెన్నూర్​లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి వివేక్ పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘దేశంలో గోల్​మాల్ చేసే  పెద్ద పెద్ద సంస్థలు..  రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ముడుపులు ఇస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే.. మిషన్​భగీరథలో రూ.40 వేల కోట్ల కుంభకోణం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ఎస్టిమేషన్లు పెంచి కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెట్టింది. ఆ తర్వాత వారి నుంచి ఎలక్టోరల్ బాండ్ల పేరిట లంచాలు తీసుకున్నది. బీఆర్ఎస్ కు మేఘా ఇంజినీరింగ్ కంపెనీ రూ.500 కోట్లు బాండ్ల రూపంలో కమీషన్లుగా ఇచ్చింది” అని వివేక్​వెంకటస్వామి ఆరోపించారు.

ప్రజల సొమ్మును మనీలాండరింగ్ రూపంలో దోచుకున్న వారిపై కేసులు బుక్ చేసి.. జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వేల కోట్ల ప్రజాధనంతో సొంత ఆస్తులు పెంచుకున్న కాంట్రాక్టర్లు, సంస్థలపై ఈడీ ఎంక్వైరీ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడీని రాజకీయ నాయకుల మీదనే కాకుండా మనీలాండరింగ్ కు పాల్పడ్డ అవినీతిపరులపైనా ప్రయోగించాలని సూచించారు. మందమర్రి మున్సిపాలిటీ పదేండ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గతంలో మున్సిపాలిటీలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు విశాక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బోర్లు వేయించామని, ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేశామని వివేక్​గుర్తుచేశారు.

కొప్పుల ఈశ్వర్  కోట్ల ఈశ్వర్​గా మారిండు: వంశీకృష్ణ 

గత పదేండ్లలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోట్ల రూపాయలు సంపాదించి కోట్ల ఈశ్వర్​గా మారారని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. ప్రజలపై దౌర్జన్యాలు చేసిన కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ లీడర్లు ఏం మొఖం పెట్టుకొని ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని ప్రశ్నించారు. పదేండ్లు బీఆర్ఎస్ రాక్షస పాలన కొనసాగిందని ఫైర్​అయ్యారు. భూకబ్జాలు, ఇసుక దందా, లంచాలతో జేబులు నింపుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు.

బాల్క సుమన్.. కేసీఆర్ దత్తపుత్రునిగా చెప్పుకుంటూ చెన్నూర్ నియోజకవర్గంలో దౌర్జన్యాలకు పాల్పడ్డాడని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని వంశీకృష్ణ అన్నారు. 70 ఏండ్ల కాంగ్రెస్ పాలన, కాకా వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి హయాంలోనే పెద్దపల్లి లోక్​సభ సెగ్మెంట్​లో డెవలప్​మెంట్​ జరిగిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ను ఓడించి తగిన గుణపాఠం చెప్పారని.. అదే తరహాలో ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్​  ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ సర్కారుతోనే పేద ప్రజల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ అంటే అధికారికంగా లంచం ఇవ్వడమేనని వంశీకృష్ణ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ అనుకూల సంస్థలు ట్యాక్స్​లు ఎగ్గొట్టి, ప్రజాధనం కొల్లగొట్టి ఆ రెండు పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లంచాలు ఇచ్చాయని ఆయన ఆరోపించారు.