
- ఉద్యోగాలు, తాగునీళ్లు, రోడ్ల సౌలత్లకు కృషి చేస్తా
- సొంత ప్రయోజనాల కోసం పనిచేయడంతోనే కేసీఆర్ ను ఓడించారు
- బాల్క సుమన్ కు ఓటర్లు సరైన జవాబు ఇచ్చారు
- కాంగ్రెస్ సర్కార్.. రోల్‌మోడల్‌గా పని చేస్తుందని వెల్లడి
కోల్‌బెల్ట్, వెలుగు : ‘‘నా గెలుపు కోసం ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు ఎంతో కృషి చేశారు. ఇది చెన్నూరు ప్రజల విజయం” అని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తాను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించానని, చెన్నూరు ప్రజల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేశానని ఆయన చెప్పారు. ఆదివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ఐజా ఇంజినీరింగ్ కాలేజ్వద్ద ఎన్నికల కౌంటింగ్ అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడారు. తన తండ్రి కాకా వెంకటస్వామి సేవలు, తమ కుటుంబంపై ఈ ప్రాంత ప్రజలు చూపిన ప్రేమ తన విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లినప్పుడు కాకా వెంకటస్వామి సంస్థ.. లక్ష మంది సింగరేణి ఉద్యోగులను కాపాడిందన్నారు. జైపూర్‌లో పవర్ ప్లాంట్ తీసుకువచ్చిన ఘనత కాకాకు దక్కుతుందని గుర్తుచేశారు. ‘‘రామగుండంలో ఎరువుల కర్మాగారం రీ ఓపెన్ చేయించాం. మా ఫౌండేషన్ ద్వారా ఈ ప్రాంతంలో వేల బోర్లు వేయించాం. స్కూళ్లకు బెంచీలు అందజేశాం. టీచర్లను ఏర్పాటు చేసి సేవలు అందించాం.
కాకా వెంకటస్వామి, మా కుటుంబం అందించిన సేవలను ప్రజలు గుర్తించి నన్ను చెన్నూరు నుంచి, నా అన్న గడ్డం వినోద్‌ను బెల్లంపల్లి నుంచి భారీ మోజారిటీతో గెలిపించారు. ప్రజలు మమ్మల్ని తమ మనిషిగా గుర్తించారు. చెన్నూరు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది ప్రజల రుణం తీర్చుకుంటా. ఉద్యోగాల కల్పన, తాగునీళ్లు, రోడ్ల సౌలత్లు కల్పించేందుకు కృషి చేస్తా” అని వివేక్ తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను అందించిందని, అందువల్లే ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు.
వివేక్‌కు కర్నాటక మంత్రి కంగ్రాట్స్
చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేక్ వెంకటస్వామిని కర్నాటక సివిల్ సప్లయ్ శాఖ మంత్రి మునియప్ప అభినందించారు. కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన మునియప్ప.. వివేక్‌ను కలిశారు. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ వెంకటస్వామికి రిటర్నింగ్ అధికారి సిడాం దత్తు అధికారికంగా సర్టిఫికెట్‌ను అందించి అభినందించారు. తన భార్య సరోజ, తనయుడు గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కాంగ్రెస్ లీడర్లతో కలిసి వివేక్.. రిటర్నింగ్ అధికారిని కలిశారు.
ఉల్లాసంగా గడిపిన గడ్డం సోదరులు
చెన్నూరు నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ విజయం సాధించడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. వివేక్ వెంకటస్వామి, వినోద్ సోదరులు చాలా సేపు కౌంటింగ్ కేంద్రం ఆవరణలో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలతో కలిసి సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు.
కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారు
మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ, అవినీతి, రాక్షస పాలనను అడ్డుకోవడానికి తాను నిరంతరం పోరాటం చేశానని వివేక్ వెంకటస్వామి తెలిపారు. కేసీఆర్ తన సొంత ప్రయోజనాల కోసమే పనిచేయడంతో ప్రజలు విసిగెత్తిపోయారని, అందువల్లే ఆయనను ఓడించారని చెప్పారు. తెలంగాణ వచ్చినా తమ బతుకులు బాగుపడలేదని, కేసీఆర్ కుటుంబానికే ఫలాలు దక్కాయని ప్రజలు గమనించి, ఈసారి బీఆర్ఎస్కు గట్టి బుద్ధి చెప్పారని వెల్లడించారు. కాంగ్రెస్ సర్కార్.. రోల్‌మోడల్ ప్రభుత్వంగా ఉంటుందన్నారు.
తమ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్‌జోడో యాత్ర తరువాత దేశ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను ఒక తాటిపైకి తీసుకువచ్చి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారని కొనియాడారు. ‘‘దమ్ము, ధైర్యం ఉంటే చెన్నూరులో నిలబడు వివేక్’’ అంటూ బాల్క సుమన్ విసిరిన సవాల్‌కు ఓటర్లు తనను గెలిపించి సుమన్ కు తగిన జవాబు చెప్పారని వివేక్ వ్యాఖ్యానించారు.