
జన్నారం, వెలుగు: దేశంలోనే అవినీతి సీఎంలలో కేసీఆర్ నంబర్ వన్ అని, రాష్ట్రంలో తుగ్లక్ పాలన చేస్తున్నారని బీజేపీ స్టేట్కోర్ కమిటీ మెంబర్, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ‘‘కేసీఆర్ తన కొడుకును సీఎం చేయడం కోసమే నిజమైన ఉద్యమకారుల గొంతుకోస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆదివాసీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ తర్వాత మర్చిపోయారు. తండాలను పంచాయతీలు చేసి పైసా ఇవ్వడం లేదు. 14, 15 ఫైనాన్స్‌ల కింద కేంద్రమే ఫండ్స్ రిలీజ్ చేస్తోంది. కుర్చీ వేసుకొని కూర్చొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని కేసీఆర్ మోసం చేశారు” అని ఆయన మండిపడ్డారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని పైడిపెల్లి పంక్షన్ హాల్లో మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ ఆధ్యర్యంలో మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర పార్టీల నుంచి దాదాపు 500 మంది బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన వివేక్ వెంకటస్వామి వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆ కుర్చీలో కూర్చోవడమే కాకుండా కొడుకు, కూతురు, అల్లుడికి పదవులను కట్టబెట్టారని విమర్శించారు. సీఎం పేషీలో ఒక్క దళిత అధికారి కూడా లేరన్నారు. ఇప్పుడున్నది బంగారు తెలంగాణ కాదని, బంగారు కల్వకుంట్ల కుటుంబమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ. 4 లక్షల కోట్లు అప్పులు చేసి అందులో రూ. లక్ష కోట్లు సంపాదించుకున్నారని, మొన్న జరిగిన నాగార్జునసాగర్ బై ఎలక్షన్లో అవినీతి సొమ్ముతోనే రూ.70 కోట్లు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అవినీతి, అప్పుల్లో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.
హుజూరాబాద్‌లో ఓట్ల కోసం కేసీఆర్ కొత్త నాటకం
హుజూరాబాద్‌లోని 40 వేల దళితులు, 15 వేల ఆదివాసీల ఓట్ల కోసం కేసీఆర్ దళిత సాధికారిత పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో, మిషన్ భగీరథ స్కీంలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ‘‘కేసీఆర్ తన ఫాంహౌస్‌కు రోడ్డు వేసుకోవడానికే వాసాలమర్రి గ్రామంలో ప్రజలకు విందు ఇచ్చారు. అడుగడుగునా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు” అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ లీడర్లు, కార్యకర్తలపై జరుగుతున్న పోలీసు దాడులు, కేసులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని, టీఆర్ఎస్ నాయకుల దాడులకు భయపడేది లేదని, ధైర్యంగా ఎదుర్కొని రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ వెరబెల్లి రఘునాథ్‌రావు, జిల్లా ఇన్చార్జి పల్లె గంగారెడ్డి, యువమోర్చా, ఎస్సీమోర్చా, మహిళా మోర్చా జిల్లా ప్రెసిడెంట్లు పట్టి వెంకటకృష్ణ, పత్తి శ్రీనివాస్, జోగుల శ్రీదేవి, జిల్లా లీడర్లు శ్రీరాంనాయక్, తమ్మిడి శ్రీనివాస్, మండల లీడర్లు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ లీడర్లతో కలిసి వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేశారు.
వివేక్ ప్రాణాలకు తెగించి కొట్లాడిండు బీజేపీ నేత రమేశ్ రాథోడ్
తెలంగాణ కోసం ప్రాణాలు సైతం ఇస్తాను అని బీజేపీ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పార్లమెంట్‌లో పోరాడారని బీజేపీ లీడర్ రమేశ్ రాథోడ్ అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించేది బీజేపీ మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి భవిష్యత్తు లేదని, పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. రేవంత్‌తో కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమీ ఉండదన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీజేపీ విజయం సాధించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.