బీఆర్ఎస్​ను ఓడించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు: వివేక్

బీఆర్ఎస్​ను ఓడించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు: వివేక్
  • కేటీఆర్​ను సీఎం చెయ్యడానికే బీఆర్ఎస్ ఏర్పాటు
  • కేసీఆర్.. దేశాన్నీ లూటీ చేయాలని చూస్తున్నడని ఫైర్ 


మంచిర్యాల/మందమర్రి/బెల్లంపల్లి, వెలుగు: సీఎం కేసీఆర్ అవినీతి, నియంతృత్వ, తుగ్లక్​ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజలు డిసైడ్​అయ్యారని, వచ్చే ఎన్నికల్లో కారుకు పంక్చర్ తప్పదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘ప్రజా గోస–బీజేపీ భరోసా’’ కార్యక్రమంలో భాగంగా బుధవారం మంచిర్యాల, మందమర్రి, నెన్నెల మండలం మైలారంలో నిర్వహించిన స్ర్టీట్​కార్నర్​మీటింగులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘కేటీఆర్​ను సీఎం చెయ్యడానికే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారు. ఎనిమిదేండ్లుగా రాష్ర్టాన్ని దోచుకున్నది చాలక.. దేశాన్నీ లూటీ చేయాలని చూస్తున్నారు. కాళేశ్వరం, మిషన్​ భగీరథ ప్రాజెక్టుల్లో కేసీఆర్ రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. మేఘా కృష్ణారెడ్డికి దోచిపెట్టి, ఆయనను ప్రపంచంలోనే ధనవంతుడిని చేశారు” అని వివేక్ ఆరోపించారు. ‘‘కాళేశ్వరం బ్యాక్ వాటర్​తో మూడేండ్లుగా పంటలు మునిగి రైతులు నష్టపోతే పట్టించుకోని కేసీఆర్.. పంజాబ్ రైతులకు మాత్రం పరిహారం ఇచ్చారు. కేసీఆర్ కుటుంబసభ్యులు వందల ఎకరాల్లో ఫామ్​హౌస్​లు కట్టుకున్నారు తప్ప.. పేదలకు మాత్రం డబుల్​బెడ్రూం ఇండ్లు కట్టియ్యలేదు. ధరణి పేరుతో పేదల భూములను పెద్దలకు కట్టబెట్టారు. పెట్రోల్, కరెంట్, బస్​చార్జీలు పెంచి జనంపై భారం మోపారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప.. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. సింగరేణి ఫండ్స్​ను సిద్దిపేట, గజ్వేల్​కు తరలిస్తూ సింగరేణి ప్రాంతాలకు నష్టం చేస్తున్నారు” అని మండిపడ్డారు. రూ.800 కోట్ల పార్టీ ఫండ్స్ కూడబెట్టి.. రూ.200 కోట్లతో విమానం కొన్నారని ఆరోపించారు. 

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం...  

ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థికమాంద్యంలో కూరుకుపోతే.. మన దేశాన్ని ప్రధాని మోడీ బలమైన ఆర్థికశక్తిగా నిలిపారని వివేక్ కొనియాడారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ.లక్ష కోట్లు ఇచ్చిందని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రధామంత్రి ఆవాస్​యోజన కింద పేదలకు ఇండ్లు కట్టిస్తే, రాష్ట్రం ఆ నిధులను కేసీఆర్ దుర్వనియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు మునిమంద రమేశ్, అందుగుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మెన హరీశ్​గౌడ్, నాయకులు కొయ్యల హేమాజీ, పెద్దపల్లి పురుషోత్తం, ఆరుముళ్ల పోశం తదితరులు పాల్గొన్నారు.

మందమర్రికి వంద కోట్లు ఇప్పిస్త...  

బీఆర్ఎస్ పాలనలో మందమర్రి మున్సిపాలిటీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని వివేక్ అన్నారు. రోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేదని.. ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారని చెప్పారు. బీజేపీని గెలిపిస్తే మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.100 కోట్ల ఫండ్స్ ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్ట్రీట్ కార్నర్​మీటింగులకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. రాష్ర్టం అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్​ను ఓడించి బీజేపీని గెలిపించాలని కోరారు. అంతకుముందు నెన్నెల మండలం మైలారంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది ముఖ్య నాయకులు బీజేపీలో చేరగా, వివేక్​వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నెన్నెల మండల కేంద్రానికి చెందిన పుప్పాల రఘు ఉద్యోగం రావడం లేదని మనస్తాపం చెంది గత నెలలో ఆత్మహత్య చేసుకోగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.