
సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కూడా ఇలాంటి తప్పుడు కేసులే పెట్టి జైలుకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూలో ధర్నా చేసినందుకే జగిత్యాల బీజేపీ నేత తిరుపతిరెడ్డిని అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనకు తిరుపతి రెడ్డి అరెస్టే నిదర్శనమని చెప్పారు. ఈ ధర్నా కేసులో బెయిల్ దొరికినా..మూడేళ్ల నాటి ఎస్సీ, ఎస్టీ కేసును తిరగతోడి తిరుపతిరెడ్డిని జైలుకు పంపించారని మండిపడ్డారు. తిరుపతిరెడ్డిని కలిసి తామంతా ఉన్నామన్న భరోసా ఇచ్చామన్నారు.
రాష్ట్రంలో కల్వకుంట్ల రాక్షస పాలన నడుస్తోందని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు కేసీఆర్ సర్కారుకు బుద్ది చెప్తారని తెలిపారు. ఎన్నో ఆశయాలు...అమరులు త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే..కల్వకుంట్ల కుటుంబం అమరుల ఆశయాలను నీరుగార్చిందని విమర్శించారు.