మాలలపై వివక్ష పెరుగుతోంది: వివేక్‌‌‌‌ వెంకటస్వామి

మాలలపై వివక్ష పెరుగుతోంది: వివేక్‌‌‌‌ వెంకటస్వామి
  •   అందరం ఐక్యంగా ఉంటూ హక్కులు 
  • సాధించుకోవాలని పిలుపు ‘దళిత రత్న’అవార్డుల ప్రదానం

హైదరాబాద్, వెలుగు: సమాజంలో బలహీన వర్గాలు ఎదగకుండా కుట్ర జరుగుతోందని, ఐక్యంగా ఉంటూ ఈ కుట్రలను తిప్పి కొట్టాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. అందరూ మానవత్వంతో ఉంటూ సాటి మనిషికి సహాయం చేయాలని సూచించారు. ఆదివారం జాతీయ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌లోని మింట్ కాంపౌండ్‌‌‌‌లో అంబేద్కర్ స్ఫూర్తి భవన్‌‌‌‌లో దళిత రత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌‌‌‌గా హాజరైన వివేక్ వెంకటస్వామి.. దళిత సమాజంలో సేవ చేసిన వారికి ‘దళిత రత్న’అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అవార్డులు వచ్చిన వారికీ గుర్తింపు తీసుకురావడం మన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కుల వివక్ష మైండ్‌‌‌‌లో ఉంటే లైఫ్‌‌‌‌లో ముందుకెళ్లలేమని, మనం చేయాల్సిన పనిని కూడా సరిగా చేయలేమన్నారు. మాలలపై వివక్ష ఉందని, వారిపై నిత్యం దాడులు పెరిగిపోతున్నాయని అందరూ ఐక్యతగా ఉంటూ ముందుకెళ్లాలని సూచించారు. అన్ని రంగాల్లో మాలలు మంచి పనులు చేస్తుంటే కొంతమంది ఓర్వలేక పోతున్నారని, అందుకే మన గుర్తింపు మనమే తెచ్చుకోవాలని, మన హక్కులు మనమే సాధించుకోవాలని పేర్కొన్నారు. 

చదువుతోనే గుర్తింపు.. 

చదువుతోనే ఎక్కువ గుర్తింపు వస్తుందని, అలాంటి చదువుని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కాకా వెంకటస్వామి స్థాపించిన అంబేద్కర్ విద్యాసంస్థల్లో 5 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, 75 శాతం మార్కులు వచ్చిన వారికి ఫ్రీ ఎడ్యుకేషన్‌‌‌‌ను అందిస్తున్నామని గుర్తుచేశారు. తమ విద్యాసంస్థల్లో స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్ కోసం ప్రత్యేకంగా క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మన గురించి అంబేద్కర్ తన జీవితమంతా కొట్లాడారని, మన జాతిని పైకి తీసుకురావడానికి కృషి చేశారని గుర్తుచేశారు. అలాంటి అంబేద్కర్ జీవిత చరిత్రను అందరూ తెలుసుకొని, ప్రతి ఒక్కరికీ చెప్పాలని వివేక్ సూచించారు.