
హుజూరాబాద్ / పెద్దపల్లి, వెలుగు: ‘కేసీఆర్ ఓ మోసగాడు.. ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేసి మళ్లీ మరిచిపోతాడు.. దళితులకు మూడెకరాల భూమి.. దళిత సీఎం.. రైతులను కోటీశ్వరులను చేస్తానన్నాడు.. కానీ సీఎం సీటు ఎక్కిన తర్వాత అన్నీ మరిచిపోయాడు. ఇప్పుడు కొత్తగా దళితుల సాధికారికత అంటున్నాడు.. ముందుగా ఎస్సీలకు భరోసా కల్పించు.. దళిత సీఎం హామీ నెరవేర్చు. కారణం చెప్పకుండా రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేసిన వ్యక్తికి దళితులపై ప్రేమ ఎక్కడుంది..?’ అని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. శుక్రవారం హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇక్కడి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి చెంచాలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నవ్వొస్తుంది. హుజూరాబాద్ నుంచి పరకాల వరకు రోడ్ నేషనల్ హైవేలాగా ఉంది. ఎస్సీ, బీసీ హాస్టళ్లు, ఇంటర్ కాలేజీ.. ఇలా అన్నింటినీ ఈటల హుజూరాబాద్ కు తీసుకువచ్చారు. కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు ఎమ్మెల్యేలు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కాలేదని చెప్పుకుంటున్నారు కానీ ఇలాంటి అభివృద్ధి వారి నియోజకవర్గాల్లో చేశారా?’ అని వివేక్ ప్రశ్నించారు. ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో జరిగిన డెవలప్ మెంట్.. హుజూరాబాద్ లో జరిగిన అభివృద్ధి మీద వైట్ పేపర్ రిలీజ్ చేయాలని సవాల్ విసిరారు.
బడుగులకు అన్యాయం చేసిండు
‘‘ఎన్నికలు రాగానే సీఎం వచ్చి హామీలు ఇస్తడు. కుర్చీ వేసుకుని కూర్చొని హామీలు తీరుస్తానని చెప్తడు. హుజుర్ నగర్, నాగార్జున సాగర్ బైఎలక్షన్స్‌లో చాలా హామీలు ఇచ్చి.. ఓట్లు వేయించుకొని తర్వాత మర్చిపోయాడు” అని విమర్శించారు. ఆంధ్రా, ఒడిశాలో కౌలు రైతులకు పాస్‌బుక్‌లు ఉన్నా, ఇక్కడ సీఎం కౌలు రైతుల కాలమ్ కూడా తీసేశారన్నారు. ఇంకో ఎమ్మెల్యే కాళేశ్వరానికి జాతీయ హోదా గురించి మాట్లాడుతున్నారని, అసలు ఈ ప్రాజెక్టు వ్యయం పెంచి లక్షల కోట్లు కమీషన్లు తిన్నారని.. ఇంకా కమీషన్లు కావాలని జాతీయ హోదా గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని వివేక్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీ మీటింగ్ లకు ఫంక్షన్ హాళ్లు ఇస్తే.. పోలీసులు బెదిరిస్తున్నారని ఓనర్లను చెబుతున్నారని అన్నారు. ఈటలతో ఎందుకు తిరుగుతున్నారంటూ ఇంటలిజిన్స్ డిపార్ట్ మెంట్ వాళ్లు అడగడం ఏమిటని.. దీనికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు.
మృతురాలి కుటుంబానికి వివేక్ పరామర్శ
కాల్వశ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య కుటుంబాన్ని వివేక్ పరామర్శించారు. సారయ్య కుటుంబ సభ్యురాలైన ఏగోళపు కనుకమ్మ ఇటీవల చనిపోయారు. వారి ఇంటికెళ్లి ఆమె చిత్ర పటానికి పూలుచల్లి నివాళి అర్పించారు.
స్టేట్ సగం ఖర్చు భరిస్తే .. కేంద్రంతో ఆర్వోబీ పూర్తి చేయిస్తా
పెద్దపల్లి నుంచి కునారం వెళ్లే రోడ్లో ట్రాక్‌పై రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సగం ఖర్చు భరిస్తే.. కేంద్రాన్ని ఒప్పించి బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తానని వివేక్ చెప్పారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేటలో ఆయన పర్యటించారు. పెద్దపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ మీదుగా వరంగల్ వెళ్లే రోడ్డులో భూంనగర్ సమీపంలో రైల్వే ట్రాక్ వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ ఒప్పుకుంటే తానే ముందుండి పూర్తయ్యేలా చూస్తానన్నారు. ఈ సందర్బంగా బీజేపీ దాని అనుబంధ సంఘాల నాయకులు వివేక్‌ను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో సజ్జాద్, బాలసాని సతీశ్, ఉనుకొండ శ్రీధర్, కొమ్ము రాజేందర్, తిరుమల దేవేందర్, సుమంత్, సంపత్, నూనేటి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు,