సెక్రటేరియట్‎లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వివేక్ వెంకటస్వామి

సెక్రటేరియట్‎లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: ఇటీవల రాష్ట్ర కేబినెట్‎లో చేరిన వివేక్ వెంకటస్వామి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2025, జూన్ 18న సెక్రటేరియట్ సెకండ్ ఫ్లోర్‎లో తనకు కేటాయించిన చాంబర్‎లో రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్, ఫ్యాక్టరీల శాఖ మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకున్నారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా తన చాంబర్‎లో మంత్రి వివేక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీమణి సరోజాతో కలిసి ప్రత్యేక పూజాల్లో పాల్గొన్నారు. 

అంతకుముందు బాధ్యతల స్వీకరణ కోసం సచివాలయానికి వెళ్లిన మంత్రి వివేక్‎కు ఆయన చాంబర్ ముందు పూర్ణకుంభంతో పూజారులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మంత్రి వివేక్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన కుమారుడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంత్రి వివేక్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆయనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సెక్రటేరియట్ కు తరలివచ్చారు. మంత్రిగా చార్జ్ తీసుకున్న వివేక్‎కు పలువురు నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. 

రాష్ట్ర ఎకానమీకి అత్యంత కీలకమైన మైనింగ్ శాఖ బాధ్యతలను మంత్రి వివేక్ వెంకటస్వామికి సీఎం రేవంత్ రెడ్డి కేటాయించిన సంగతి తెలిసిందే. గనుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు కార్మికుల సంక్షేమం, ఉపాధి, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ లాంటి కీలక బాధ్యతలు ఆయనకు అప్పగించారు. వివేక్కు ఉన్న అనుభవం, రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ శాఖలను కేటాయించారు.

గతంలో వివేక్ తండ్రి దివంగత గడ్డం వెంకటస్వామి (కాకా) కూడా1978–1982 మధ్య ఉమ్మడి ఏపీలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రంలోనూ కార్మిక  మంత్రిత్వ శాఖను నిర్వహించారు. వివేక్ అన్న గడ్డం వినోద్ కూడా ఉమ్మడి ఏపీలో వైఎస్​ హయాంలో 2004 నుంచి 2009 వరకు కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. ఇలా వివేక్ కుటుంబానికి కార్మికులతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయనకు దీనితోపాటు ఉపాధి, మైనింగ్ శాఖలు నిర్వహించే అవకాశం దక్కింది.