ఐపీఎల్ నుంచి తప్పుకున్న వివో

ఐపీఎల్ నుంచి తప్పుకున్న వివో

భారత్‌-చైనా వివాదం కారణంగా చైనాకు చెందిన యాప్‌లపై భారత్‌ నిషేధం విధించింది. ఇప్పటికే చాలా వరకు యాప్ లను బ్యాన్ చేసింది.మరోవైపు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ వివోను ఐపీఎల్‌కు టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగించడానికి బీసీసీఐ మొగ్గుచూపడంతో ఇప్పటివరకూ తీవ్ర దుమారం రేగింది. అదే సమయంలో బీసీసీఐ వ్యహరిస్తున్న తీరుపై రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. ప్రధానంగా సోషల్‌ మీడియాలో విమర్శల జోరు అందుకోవడంతో వాటికి ముగింపు పలకడానికి వివో సిద్ధమైంది. ఈ క్రమంలోనే స్వచ్ఛందంగానే ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది.

అయితే బీసీసీఐ మాత్రం ఇంకా అంగీకరించలేదని సమాచారం. ఈ క్రమంలోనే వీరి మధ్య చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారతదేశం- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల క్రమంలో దేశంలో వివిధ రంగాల నుండి చైనా వస్తువులను బాయ్ కాట్ చెయ్యాలని పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రభుత్వం చైనా దేశానికి సంబంధించి 59 యాప్ లను నిషేధించింది. ఈ సమయంలో ఐపీఎల్‌ స్పాన్సర్ గా కొనసాగడం మంచిది కాదని భావించిన వివో సంస్థ స్వచ్ఛందంగా స్పాన్సర్ షిప్ నుండి విరమించుకోవడానికి రెడీ అయ్యింది. అయితే కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే తప్పుకునే విధంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.