నా రీఎంట్రీకి టైమొచ్చింది .. వీకే శశికళ కామెంట్

నా రీఎంట్రీకి టైమొచ్చింది ..  వీకే శశికళ కామెంట్

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ కీలక ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి దృష్ట్యా అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) పతనమైనట్లు భావించొద్దని, పార్టీలోకి తాను రీఎంట్రీ ఇచ్చే టైమ్ వచ్చేసిందని తెలిపారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 'అమ్మ(జయలలిత) పాలన'ను తిరిగి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఆదివారం ఆమె పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష హోదాలో  ఉన్న ఎడప్పాడి కె.పళనిస్వామి.. ప్రభుత్వాన్ని  నిలదీయలేకపోతున్నారని శశికళ ఆరోపించారు. కుల ఆధారిత రాజకీయాలు పార్టీలోకి ప్రవేశించాయని మండిపడ్డారు. లోక్‌‌సభ ఎన్నికల్లో పార్టీ మూడు, నాలుగు స్థానాలకు దిగజారిందని.. అనేక స్థానాల్లో డిపాజిట్ కూడా కోల్పోయిందని 

ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తానే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ..పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు.  “తమిళనాడు ప్రజలు మనతో ఉన్నారు. నేను చాలా నమ్మకంతో ఉన్నాను. నా ఎంట్రీ(రీఎంట్రీ) మొదలైంది. అన్నాడీఎంకే పనైపోయిందనుకోవద్దు" అని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టి డీఎంకే పాలనను ఎండగడతానని శశికళ చెప్పారు. కార్యకర్తలు, ప్రజల మద్దతుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి 'అమ్మ' పాలనకు నాంది పలుకుదామన్నారు.