రష్యా బలగాలకు మరో ఎదురుదెబ్బ

రష్యా బలగాలకు మరో ఎదురుదెబ్బ
  • రష్యా బలగాలకు మరో ఎదురుదెబ్బ
  • ఉక్రెయిన్ లో మరో నది వద్ద భారీ నష్టం 
  • 7 డ్రోన్ లు, 2 హెలికాప్టర్లు, 2 మిసైల్స్ ను కూల్చేసిన ఉక్రెయిన్   
  • ఇటీవలే ఓ నది వద్ద 52 రష్యన్ ట్యాంకుల పేల్చివేత

కీవ్/మాస్కో: ఉక్రెయిన్ లో రష్యన్ బలగాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సెంట్రల్ ఉక్రెయిన్ లోని ఇంగూలెట్స్ నది వద్ద రష్యాకు చెందిన 7 డ్రోన్ లు (యూఏవీలు), ఒక కేఏ52 హెలికాప్టర్, ఒక మిగ్ 28 చాపర్, 2 క్రూయిజ్ మిసైల్స్ ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. నదిని దాటాలన్న రష్యన్ బలగాల ప్రయత్నాన్ని ఎయిర్ ఫోర్స్ దీటుగా తిప్పికొట్టిందని ‘కీవ్ ఇండిపెండెంట్’ పత్రిక సోమవారం వెల్లడించింది. యూరప్ లోని పెద్ద నదుల్లో ఒకటైన దినీపర్ రివర్ కు ఉపనది అయిన ఇంగూలెట్స్ నదిని రష్యన్ బలగాలు దాటుతుండగా ఈ దాడులు చేసినట్లు తెలిపింది. డోనెట్స్క్ ప్రాంతంలోని సివర్ స్కీ డోనెట్స్ నది వద్ద కూడా ఇటీవల రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ నది వద్ద బ్రిడ్జిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ ఆర్మీ.. రష్యాకు చెందిన 52 యుద్ధట్యాంకులను, మిలిటరీ వెహికల్స్ ను పేల్చేసింది.  

నాటోలో చేరేందుకు అప్లై చేస్తాం: స్వీడన్ 

నాటో కూటమిలో సభ్యత్వం తీసుకునేందుకు స్వీడన్ కూడా అప్లై చేసుకుంటుందని ఆ దేశ ప్రధాని మాగ్డలీనా అండర్సన్ ప్రకటించారు. అయితే ఫిన్లాండ్, స్వీడన్ లో కొత్త మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో సమస్య ఏర్పడుతుందని, ఆ దేశాలపై చర్యలు తప్పవని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు.

ఖార్కివ్​లో బార్డర్​కు చేరిన ఉక్రెయిన్ ఆర్మీ 

ఖార్కివ్ రీజియన్ నుంచి రష్యన్లను తరిమేశామని ఉక్రెయిన్ సోల్జర్లు ప్రకటించారు. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్. మనం సాధించాం. శత్రుదేశపు బార్డర్​కు చేరుకున్నాం” అనే క్యాప్షన్ తో ఓ వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖ సోమవారం ఫేస్​బుక్​లో పోస్ట్ చేసింది. టెరిటోరియల్ ఆర్మీ 127వ బ్రిగేడ్​కు చెందిన 227వ బెటాలియన్ సోల్జర్లు బార్డర్​కు చేరిన సందర్భంగా ఈ వీడియోను తీసినట్లు తెలిపింది. మరోవైపు సెవెరోడెనెట్స్క్ లోని ఓ ఆస్పత్రిపై రష్యా జరిపిన బాంబు దాడి లో ఇద్దరు మరణించారని, 9 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. రష్యన్ బలగాలను అడ్డుకునేందుకు రూబిజ్నే, సెవెరోడోనెట్స్క్ మధ్య రైల్వే బ్రిడ్జిలను పేల్చేశామని తెలిపింది.