ఒకేషనల్ కోర్సులు.. ఉపాధికి బాటలు .. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు శిక్షణ

ఒకేషనల్ కోర్సులు.. ఉపాధికి బాటలు .. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు శిక్షణ
  • మెదక్​ జిల్లాలోని 13 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు

మెదక్/పాపన్నపేట, వెలుగు: గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను పెంచి, భవిష్యత్ లో వారు స్వయం ఉపాధి అవకాశాలు పొందేలా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, మోడల్​స్కూళ్లలో పలు ఒకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ వృత్తివిద్య కోర్సులు నిర్వహిస్తున్నారు. 

పీఎంశ్రీ, సమగ్ర శిక్ష అభియాన్..

మెదక్​జిల్లాలోని 13  పాఠశాలల్లో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టారు. పీఎంశ్రీ కింద కొన్ని, సమగ్ర శిక్ష అభియాన్​ కింద కొన్ని స్కూళ్లలో ఈ కోర్సులు నేర్పిస్తున్నారు. సమగ్ర శిక్ష ద్వారా ఇన్​స్ట్రక్టర్లను నియమించారు. పెద్ద శంకరంపేట మండలం తిర్మలాపూర్, రేగోడ్, టెక్మాల్, రామాయంపేట మండలం కోమటిపల్లి, చేగుంట మండలం వడ్యారం, చిన్న శంకరంపేట, నర్సాపూర్ మండలం జక్కపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూళ్లు(టీజీఎంఎస్), మెదక్ పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, తూప్రాన్ బాయ్స్ హైస్కూల్, వెల్దుర్తి, కొల్చారం మండలం రంగంపేట, హవేలీ ఘనపూర్, పాపన్నపేట జిల్లా పరిషత్ హైస్కూళ్లలో ఒకేషనల్ కోర్సులు కొనసాగుతున్నాయి. 

కనీసం రెండు కోర్సులు..

ఎంపిక చేసిన ఆయా పాఠశాలల్లో 9, 10 తరగతులతోపాటు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్యూటీషియన్, వెల్​నెస్, మీడియా ఎంటర్​టైన్​మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్​హార్డ్​వేర్, ఐటీఈఎస్, హెల్త్ కేర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ బడిలో కనీసం రెండు కోర్సులు ప్రారంభించారు.  

శిక్షణ బాగుంది

స్కూల్ లో చదువుతోపాటు ఒకేషనల్  కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం బాగుంది. నేను ఐటీఈఎస్ నేర్చుకుంటున్నాను. ఇన్​స్ట్రక్టర్ అన్ని అంశాలు నేర్పిస్తున్నారు.
- అఖిల, 9వ తరగతి, పాపన్నపేట 

ఉపాధికి పనికొస్తుంది

 నేను ఎలక్ట్రానిక్స్ కోర్సులో జాయిన్​అయ్యాను. భవిష్యత్తులో ఉపాధికి ఇది పనికొస్తుంది. ఒకేషనల్​కోర్సులు పాఠశాలల్లో ప్రవేశపెట్టడం మంచి ఆలోచన.

లక్ష్మీనారాయణ, 10వ తరగతి, పాపన్నపేట 

వారంలో రెండు రోజులు

మా పాఠశాలలో రెండేళ్లుగా ఒకేషనల్ కోర్సులు అమలవుతున్నాయి. 9, 10 తరగతుల విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్, ఐటీఈఎస్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. వారంలో రెండు రోజులు ఒకేషనల్ కోర్సుల క్లాస్ లు ఉంటాయి. శిక్షణ పూర్తయ్యాక బోర్డు ద్వారా పరీక్ష నిర్వహించి పాసైన విద్యార్థులకు సర్టిఫికెట్ అందిస్తాం.   

మహమూద్, ఒకేషనల్ కోర్సు ఇన్​స్ట్రక్టర్, జడ్పీహెచ్ఎస్, పాపన్నపేట