
Vodafone Idea: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో వొడఫోన్ ఐడియా కంపెనీ షేర్లు 10 శాతానికి పైగా క్రాష్ అయ్యాయి. ప్రధానంగా ఇన్వెస్టర్లు లాభాల బుక్కింగ్ కోసం ప్రయత్నించటంతో స్టాక్ రేటు పడిపోయినట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో టెలికాం రంగానికి చెందిన ఇండస్ టవర్స్ షేర్లు కూడా ఇంట్రాడేలో నష్టపోయాయి. వాస్తవానికి విఐ సంస్థ ఏడీఆర్ బకాయిలపై కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ప్రకటన ఇన్వెస్టర్లను అప్రమత్తం అయ్యేలా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
వొడఫోన్ ఐడియా బకాయిలపై కొత్తగా ఎలాంటి రీలీఫ్ ప్లాన్ తమ వద్ద చర్చల్లో లేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగస్ట్ 25న క్లారిటీ ఇచ్చారు. విఐ రుణాలను చాలా వరకు తాము ఈక్విటీగా మార్చినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే కంపెనీని ముందుకు నడిచేలా చేసేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు, సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించిందని మంత్రి చెప్పారు. అయితే అదనంగా ఏవైనా ఏజీఆర్ రీలీఫ్ ఇవ్వాలంటే దానికి ముందుగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం అవసరమని ఆయన చెప్పారు.
అయితే వారం కిందట వొడఫోన్ ఐడియా బకాయిలపై రిలీఫ్ ఇచ్చేందుకు మరో రెండేళ్లపాటు గడువు పొడిగించే యోచనలో ప్రధాన మంత్రి ఆఫీసు ఉన్నట్లు వార్త వచ్చింది. ఇందులో బకాయిలను చిన్న మెుత్తాలుగా ఏటా చెల్లించటానికి అలాగే వడ్డీ, పెనాల్డీల తొలగింపుకు ఆమోదం ఇవ్వనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో అసలు నిజం లేదని తమ వద్ద అలాంటి ప్రతిపాదనలు ఏమీ చర్చల్లో లేవని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించటంతో తాజాగా విఐ ఇన్వెస్టర్లు అప్రమత్తం అయ్యారు. ఉదయం 10.57 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో వొడఫోన్ ఐడియా కంపెనీ షేర్ల ధర ఒక్కోటి 10.41 శాతం నష్టంతో రూ.6.63 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.