
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. అందరూ వాడే అకౌంటింగ్ పద్ధతులను కాకుండా.. వేరే అకౌంటింగ్ ప్రాక్టీస్‌లను వాడటం వల్లే జియో నెట్‌వర్క్ ధర తక్కువగా ఉందని ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను జియో కొట్టేస్తోంది. ఈ రెండింటికి సంబంధం లేదని, ఖర్చులో తేడా లేటెస్ట్ టెక్నాలజీని జియో కస్టమర్లకు అందించడంలో వచ్చిందని అంటోంది. ‘వాయిస్ కాల్‌ను అందించే ఖర్చు విషయంలో అకౌంటింగ్ ప్రమాణాలు ఏమీ చేయలేవు. ఇండియన్ అకౌంటింగ్ ప్రమాణాలనే జియో వాడుతోంది. మేము ఇతర ఆపరేటర్లకు భిన్నమైన అకౌంటింగ్ ప్రమాణాలను వాడుతున్నామని చేస్తోన్న ఆరోపణలన్నీ నిరాధారం’ అని సీనియర్ జియో ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. జియో వాడే అకౌంటింగ్ విధానాలతో భారీగా ఖర్చులో తేడా వస్తోందని సీనియర్ ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ ఒకరు ఆరోపించారు. కానీ వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ(ఓల్ట్) టెక్నాలజీని దేశమంతా అందించడంతో, తక్కువ ధరకు 4జీ నెట్‌వర్క్‌ను తాము అందిస్తున్నట్టు జియో ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఐపీ నెట్‌వర్క్ పై చేసే వాయిస్ కాల్ కాస్ట్ దాదాపు జీరోగా ఉందని అన్ని అథారిటీలు చెప్పినట్టు గుర్తు చేశారు. నిమిషానికి ఇది కేవలం 0.05 పైసనే ఉంటుందని పేర్కొన్నారు.