సోషల్ మీడియా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక చేసింది. కంటెంట్ క్రియేటర్లు, వార్తా సంస్థల కష్టాన్ని వాడుకుంటూ భారీగా లాభపడుతున్న ప్లాట్‌ఫారమ్‌లు.. ఇకపై ఆ ఆదాయాన్ని వారితో సమానంగా పంచుకోవాల్సిందేనని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఒకవేళ స్వచ్ఛందంగా ఈ మార్పు చేయకుంటే.. చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ సదస్సులో ఆయన చేసిన హెచ్చరిక ఇప్పుడు సోషల్ మీడియా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రస్తుతం పెద్ద పెద్ద మీడియా సంస్థల నుంచి మారుమూల గ్రామాల్లో ఉండే ఇండిపెండెంట్ కంటెంట్ క్రియేటర్ల వరకు అందరూ సోషల్ మీడియానే నమ్ముకున్నారు. అయితే వారు సృష్టించే ఒరిజినల్ కంటెంట్ వల్ల ప్లాట్‌ఫారమ్‌లకు భారీగా యాడ్ రెవెన్యూ వస్తోంది. కానీ క్రియేటర్లకు అందుతున్నది మాత్రం చాలా తక్కువగానే ఉంటోంది. వార్తా సంస్థలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ప్రొఫెసర్లు, పరిశోధకులు.. ఇలా కంటెంట్ సృష్టించే ప్రతి ఒక్కరికీ న్యాయమైన ఆదాయ వాటా దక్కాలన్నారు. మేధో సంపత్తికి తగిన విలువ ఇవ్వకుంటే సైన్స్, టెక్నాలజీ, కళా రంగాల అభివృద్ధి కుంటుపడుతుందని కేంద్ర మంత్రి హెచ్చరించారు.
చట్టం తన పని తాను చేస్తుంది..
సోషల్ మీడియా సంస్థలు తమ రెవెన్యూ షేరింగ్ పాలసీలను పునఃసమీక్షించుకోవాలని మంత్రి కోరారు. కంపెనీలు స్వచ్ఛందంగా మార్పులు చేయకపోతే, ఇప్పటికే చాలా దేశాలు దీన్ని చట్టబద్ధంగా ఎలా చేయించుకోవాలో మార్గాలను చూపించాయన్నారు. భారత్ కూడా అదే దిశగా అడుగులు వేయాల్సి ఉంటుందని కుండబద్దలు కొట్టారు. అంటే రాబోయే రోజుల్లో క్రియేటర్లకు మేలు చేసేలా కొత్త చట్టాలు వచ్చే అవకాశం ఉందని పరోక్షంగా ఆయన కామెంట్స్ ద్వారా చెప్పుకోవచ్చు.
ALSO READ : సోషల్ మీడియా 'అల్గోరిథం' మాయలో పడుతున్నారా?
డీప్‌ఫేక్స్.. డిస్‌ఇన్ఫర్మేషన్‌పై బాధ్యత
కేవలం ఆదాయం మాత్రమే కాదు.. కంటెంట్ విషయంలోనూ ప్లాట్‌ఫారమ్‌లు బాధ్యతాయుతంగా ఉండాలని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. డీప్‌ఫేక్స్, తప్పుడు సమాచారం వల్ల సమాజంలో ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జరగని విషయాలను జరిగినట్లుగా సృష్టించి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని, ఇటువంటి కంటెంట్‌కు ఆయా సోషల్ మీడియా సంస్థలే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.
