తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక కీలక ఘట్టం. ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే ఈ స్థానిక ఎన్నికల్లో పౌరుల క్రియాశీల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఆయన నేతృత్వంలో ఆమోదించిన.. 73వ రాజ్యాంగ సవరణ చట్టం స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ హోదాతోపాటు పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించింది. ఈ పరిణామం లక్షలాది మంది మహిళలకు గ్రామ పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడమే కాదు, రాష్ట్ర, జాతీయస్థాయి నేతలుగా ఎదగడానికి అవకాశం కల్పించింది.
కౌన్సిలర్ నుంచి భారత రాష్ట్రపతిగా ఎదిగిన ద్రౌపది ముర్ము, జిల్లా పంచాయతీ స్థాయి నుంచి కేంద్ర మంత్రి అయిన సావిత్రి ఠాకూర్, సర్పంచుగా పనిచేసి కేంద్ర సహాయ మంత్రి అయిన రక్షా నిఖిల్ ఖడ్సే వంటి నేతలు మన ముందున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా సాధారణ వ్యక్తులు కూడా గొప్ప నేతలుగా ఎదగవచ్చని నిరూపించారు.
ఓటు వేయడం ప్రజల బాధ్యత
ఈ ఎన్నికల్లో ఓటు వేయడం ప్రజల హక్కు, బాధ్యత కూడా. సామర్థ్యం, నిజాయితీ, సేవా భావన ఉన్న అభ్యర్థులను ఎన్నుకోవడం గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అభ్యర్థులను ఎన్నుకోవడానికి ముందు - గ్రామ అభివృద్ధికి వారి ప్రణాళికలు ఏమిటి, మహిళలు, బాలికలు, వెనుకబడిన వర్గాల సాధికారతకు వారి ప్రణాళిక ఏమిటి, స్వచ్ఛత, నీరు, రోడ్లు, విద్య, ఆరోగ్య సౌకర్యాల మెరుగుదలకు వారి వ్యూహం ఏమిటి అని
ప్రశ్నించడం చాలా ముఖ్యం.
మహిళా సర్పంచ్లతో ఆదర్శమైన గ్రామాలు
మహిళా నేతృత్వంలోని పంచాయతీల విజయగాథలు మహిళా నాయకత్వ శక్తిని చాటుతున్నాయి. తెలంగాణలోని అనంతోగులో మహిళల నేతృత్వంలో మద్యపాన నిషేధం, ఉత్తరప్రదేశ్‌లోని లతీఫ్‌పూర్‌లో వరకట్న రహిత వివాహాలు, కేరళలోని మట్టూల్ డ్రగ్స్ నిర్మూలన, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో వితంతువులను అవమానించే దురాచారాల నిర్మూలన, రాజ్‌పూర్‌లో మహిళా సర్పంచ్ చొరవతో
ప్లాస్టిక్ రహిత గ్రామం వంటివి మహిళా నాయకత్వ పటిమకు నిదర్శనాలు.
మహిళలను ప్రోత్సహించాలి
మహిళలు కేవలం రిజర్వ్ చేసిన సీట్లలో మాత్రమే కాకుండా, ఇకపై సాధారణ సీట్లలో కూడా పోటీ చేయాలి. రిజర్వేషన్ సీట్లు ఒక అవకాశం మాత్రమే కల్పిస్తాయి. సాధారణ సీట్లలో గెలుపు వారి నిజమైన శక్తిని, ప్రజల విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. ఈ స్థానిక మహిళలే రేపు శాసనసభ, పార్లమెంటులో నాయకత్వం వహిస్తారు. కుటుంబ సభ్యులు కూడా మహిళలను ప్రోత్సహించాలి. 2029 నాటికి 106వ రాజ్యాంగ సవరణ (నారీ శక్తి వందన్) చట్టం అమలైతే లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు 33% స్థానాలు కేటాయించడం జరుగుతుంది.
నియోజకవర్గాల పునర్విభజనతో శాసనసభ సీట్లు పెరిగితే మరిన్ని సీట్లు మహిళలకు చెందుతాయి. ఇందరు మహిళా నేతలు ఎక్కడి నుంచి వస్తారు? గ్రామీణ నేపథ్యం ఉన్నవారు, స్థానిక పరిపాలనలో పరిణతి గలవారు రావాలి. తెలుగు రాష్ట్రాలలో 13,000 మందికి పైగా మహిళా సర్పంచులు, మండల అధ్యక్షులు, జడ్పిటిసి సభ్యులు ఉంటారు. వీరిలో సామర్థ్యం, పట్టుదల ఉన్నవారిని గుర్తించి, నాయకత్వ శిక్షణ అందిస్తే, వారు సర్పంచులుగానే ఆగిపోకుండా శాసనసభ, పార్లమెంటు సభ్యులుగా ఎదుగుతారు.
ప్రజాస్వామ్య విజయం
రాజకీయ కుటుంబాల చాటు నుంచి కాకుండా, గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగే మహిళా నేతలు అసెంబ్లీ, పార్లమెంటు స్థాయిలో నాయకత్వం వహిస్తే, అది భారత ప్రజాస్వామ్యానికి నిజమైన విజయం. 764 ఏండ్ల క్రితమే (క్రీ. శ. 1261) రుద్రమదేవిని కాకతీయ సామ్రాజ్య చక్రవర్తిగా తెలుగు ప్రజలు గౌరవించారు. అయితే, చట్టాలు, ఉత్తర్వులు, దస్త్రాలు ఆంగ్లంలోనే ఉండటంతో స్థానిక నేతలు పరిపాలనలో పూర్తిస్థాయిలో పాల్గొనలేకపోతున్నారు. సామర్థ్యం, పట్టుదల ఉన్న గ్రామీణ నేతలు ఉన్నత స్థాయికి ఎదగకపోవడానికి ఇది అడ్డంకిగా మారుతోంది. పరిపాలనా వ్యవహారాలు ప్రజల భాషలో జరగనప్పుడు గోప్యత పెరిగి, అవినీతికి అవకాశం ఏర్పడుతుంది.
శక్తిమంతమైన వేదిక గ్రామ సభ
ప్రజలు గ్రామసభలకు హాజరుకావడం ద్వారా కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితం కాకుండా, స్థానిక పాలనలో భాగస్వాములుగా మారవచ్చు. గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో పేర్లున్న ప్రతి ఒక్కరూ గ్రామసభలో సభ్యులే. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి సంవత్సరం కనీసం ఆరు గ్రామసభలు నిర్వహించడం తప్పనిసరి. అందులో రెండు సభలు ప్రత్యేకంగా మహిళల కోసం జరపాలి. ఊరి అభివృద్ధి, సంక్షేమం గురించి అందరూ ఒకచోట చేరి చర్చించుకుని నిర్ణయాలు తీసుకునే ఈ వేదిక ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం. గ్రామసభలను నిర్వహించకపోతే సర్పంచిని పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. సభలో జరిగిన చర్చలను, తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు మినిట్స్ పుస్తకంలో రాస్తారు. మొత్తం ప్రక్రియను వీడియో తీస్తారు. ఈ సభలో గ్రామానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుంది.
పారదర్శకత కోసం గ్రామ సభలు అవసరం
ప్రభుత్వ పథకాలు నిజమైన పేదలకు అందుతున్నాయో లేదో పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం గ్రామసభదే. గ్రామానికి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలను అడిగి తెలుసుకునే హక్కు సభ్యులకు ఉంటుంది, గ్రామసభలు ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రశ్నించే అవకాశాన్ని కల్పిస్తాయి. దీనివల్ల పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయి.
సభ్యులందరూ చర్చించిన తర్వాత, మెజారిటీ ప్రజల ఆమోదం మేరకు చేతులెత్తే విధానం ద్వారా తీర్మానాలను ఆమోదిస్తారు. పౌరుల నిరంతర పర్యవేక్షణ అవినీతిని అరికట్టడానికి, పనులలో నాణ్యతను పెంచడానికి సహాయపడుతుంది. మహిళలకు కూడా గ్రామసభల్లో మాట్లాడే అవకాశం కల్పించాలి. బలమైన గ్రామాన్ని నిర్మించడమే శక్తిమంతమైన దేశ నిర్మాణానికి పునాది.
శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకుడు

