నామినేషన్ల గడువు వరకూ ఓటర్ల నమోదు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకు సీఈవో భరోసా

నామినేషన్ల గడువు వరకూ ఓటర్ల నమోదు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకు సీఈవో భరోసా
  • 6వ తేదీ గడువు దాటినా ఆందోళన వద్దు
  • ఆదివారం నుంచి మొరాయించిన పోర్టల్
  • స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ‘ఎర్రర్ 503’.. పట్టభద్రుల తిప్పలు
  • పాత ఓటర్లూ మళ్లీ అప్లై చేయాల్సిందేనని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకూ పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)  సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫామ్-18 దరఖాస్తుల గడువు ఈ నెల 6తో ముగిసినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఓటు నమోదు పోర్టల్ (ceotserms2.telangana.gov.in/MLC/Form18.aspx) ఆదివారం మధ్యాహ్నం నుంచి పనిచేయకపోవడంతో పట్టభద్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ ఓపెన్ చేయగానే ‘ఎర్రర్ 503.. సర్వీస్ ఈజ్ అన్‌‌‌‌‌‌‌‌అవైలబుల్’ అని రావడంతో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. సోమవారం రాత్రి వరకూ సమస్య కొనసాగింది. గడువు దగ్గరపడుతున్న వేళ సర్వర్లు మొరాయించడంతో పట్టభద్రుల్లో ఆందోళన నెలకొనగా, సీఈవో స్పందించారు. పోర్టల్‌‌‌‌‌‌‌‌లో సాంకేతిక సమస్యలను సరిచేసి సేవలను పునరుద్ధరిస్తామని చెప్పారు.