తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏల సమ్మె కంటిన్యూ అవుతోంది. డిమాండ్లను నెరవేర్చకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 18 రోజుకు చేరుకున్న సందర్భంగా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు వంట వార్పు నిర్వహించారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పే స్కేల్, కారుణ్య నియామకాలు, 55 సంవత్సరాలకు పైబడిన వీఆర్ఏలకు పింఛన్లు, వీఆర్ఏలకు ప్రమోషన్లు తదితర డిమాండ్లపై వారు సమ్మె నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన పే స్కేల్ ను అడుగుతున్నామని, పలు సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
తమ డిమాండ్లను నెరవేర్చాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 09వ తేదీన వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన సందర్భంలో సీఎం కేసీఆర్ పలు హామీలిచ్చారని తెలిపారు. నిండు అసెంబ్లీలో హామీలిచ్చి మరిచిపోయారని విమర్శించారు. రాష్ట్ర కార్యవర్గంతో చర్చలు జరపాలని, 15వ రోజు వరకు తాము సమ్మె చేపడుతామని, అప్పటిలోగా స్పందించకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమకు మద్దతు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.
