ఆర్టీసీలో 15 వేల మందికి వీఆర్​ఎస్​!

ఆర్టీసీలో 15 వేల మందికి వీఆర్​ఎస్​!
  • ఇంట్రెస్ట్​ ఉన్నోళ్లు వివరాలు ఇవ్వాలంటూ మౌఖిక ఆదేశాలు
  • ఒక్కరోజులోనే వీఆర్​ఎస్​కు ముందుకొచ్చిన 2 వేల మంది 
  • వారి ప్యాకేజీకి రూ.3 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా
  • భూములు కుదువ పెట్టి అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలు
  • ఉద్యోగులు తగ్గాక చిన్న డిపోలను వేరే డిపోల్లో కలిపేందుకు కసరత్తులు

హైదరాబాద్​, వెలుగు: స్టాఫ్​ ఎక్కువగా ఉన్నారన్న సాకుతో ఉద్యోగులను తగ్గించేందుకు ఆర్టీసీ ప్లాన్​ చేస్తోంది. 15 వేల మందికి వీఆర్​ఎస్​ ఇచ్చి ఇంటికి పంపాలని యోచిస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. వీఆర్​ఎస్​ తీసుకునేందుకు ఇంట్రెస్ట్​ ఉన్న ఉద్యోగులు వివరాలు ఇవ్వాల్సిందిగా పెద్దాఫీసర్లు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం ఒక్క రోజే సుమారు 2 వేల మంది వీఆర్​ఎస్​ కోసం ముందుకొచ్చారు. వీఆర్​ఎస్​ తీసుకున్నోళ్లకు ప్యాకేజీ కింద డబ్బులిచ్చేందుకు అప్పు తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఉద్యోగుల సంఖ్య తగ్గాక చిన్న డిపోలను.. పెద్ద డిపోల్లో కలిపేసేందుకూ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. హుస్నాబాద్​, నార్కట్​పల్లి, మెట్​పల్లి, కోరుట్ల తదితర డిపోలను ఇతర డిపోల్లో విలీనం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని డిపోలను వాటికి దగ్గరున్న డిపోలకు తరలించారు.  

డ్రైవర్లు, కండక్టర్లే ఎక్కువ
రాష్ట్రంలో ఆర్టీసీ 9 వేల బస్సులు నడుపుతుండగా.. అందులో 3 వేల అద్దె బస్సులున్నాయి. మొత్తంగా 48 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో డ్రైవర్లు, కండక్టర్లే ఎక్కువ. ఒక్కో బస్సుకు ఏడుగురు దాకా పనిచేస్తున్నారు. అయితే అదనంగా ఉన్న ఉద్యోగుల వల్ల సంస్థపై ఆర్థిక భారం పడుతోందన్న కారణంతో వీఆర్​ఎస్​ ఇచ్చి పంపేందుకు ఆలోచన చేస్తోంది. ఉద్యోగి అనుభవం, సర్వీస్​ ఆధారంగా ప్యాకేజీని ఇచ్చే చాన్స్​ ఉంది. ఫైనల్​గా వీఆర్​ఎస్​, ప్యాకేజీలకు సర్కారు అనుమతివ్వాల్సి ఉంటుంది. 

సీక్రెట్​గా తంతు
ఉద్యోగుల వీఆర్ఎస్​పై ఆర్టీసీ సీక్రెట్​గా చర్యలు చేపడుతోంది. వీఆర్ఎస్​కు ఇంట్రెస్ట్​  చూపిస్తున్న ఉద్యోగుల వివరాలను తీసుకునే బాధ్యతలను డిపో సూపరింటెండెంట్లకు అప్పగించింది. కేవలం ఓరల్​ ఆర్డర్స్​ ఇచ్చి, వీఆర్ఎస్​ తీసుకోవాలనుకునే వాళ్లు వివరాలను ఇచ్చేందుకు డిపోల్లో ఓ రిజిస్టర్​ను పెట్టారు. ఈ క్రమంలోనే పెద్ద వయసు వాళ్లు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నోళ్లు, పనిభారం ఎక్కువగా ఉందనుకునేటోళ్లు, సంస్థ ఉంటుందో ఉండదోనన్న అనుమానం ఉన్నోళ్లు చాలా మంది వీఆర్​ఎస్​ తీసుకునేందుకు రిజిస్టర్లలో తమ వివరాలను రాసిచ్చారు. గురువారం ఒక్కో డిపో నుంచి సగటున 20 మంది వీఆర్​ఎస్​కు ముందుకొచ్చారు. కరీంనగర్​– 2 డిపో నుంచి 4‌‌0 మంది, ఆర్మూర్​, కరీంనగర్​–1 డిపోల నుంచి 30 మంది చొప్పున వీఆర్​ఎస్​ కోసం పేర్లు ఇచ్చారు. 

అప్పుకోసం ప్రయత్నాలు
వీఆర్ఎస్​ ఇవ్వాలనుకుంటున్న ఉద్యోగుల ప్యాకేజీ కోసం భారీగా నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఉద్యోగికి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల చొప్పున కనీసం రూ.3 వేల కోట్లు కావాలని అంటున్నారు. ఆ డబ్బుల కోసం సంస్థ కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. అప్పు కోసం ఇప్పటికే వివిధ బ్యాంకులను సంప్రదించినట్టు ఆర్టీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన సంస్థ.. ఇప్పుడు కొత్త అప్పు కోసం స్థలాలను తాకట్టు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

సర్కారు ఆదుకోట్లే
ఆర్టీసీని సర్కారు ఆదుకోవట్లేదని, ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని యూనియన్ల నేతలు ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి సంస్థపై సర్కారుకు చిన్నచూపేనని మండిపడుతున్నారు. వాస్తవానికి తెలంగాణ వచ్చాక కొత్త బస్సులను కొనడమే సర్కార్​ బంద్​ పెట్టింది. పాత బస్సులను స్క్రాప్​ అంటూ సర్వీస్​ నుంచి తీసేస్తున్నారు. కొత్త బస్సులు కొందామన్నా సంస్థ దగ్గర డబ్బుల్లేవు. దీంతో చాలా మంది ఉద్యోగులకు పని లేకుండా పోతోందని అంటున్నారు. ఈ ఏడాది బడ్జెట్​లో రూ.1,500 కోట్లు సర్కారు కేటాయించినా.. అందులో రూ.వెయ్యి కోట్లు బస్​పాస్​ రీయింబర్స్​మెంట్​ కింద ఆర్టీసీకి సర్కారు చెల్లించాల్సిన బకాయిలే ఉన్నాయి. 

లెక్క తేలినంక చర్యలు
సంస్థలో చాలా మంది ఉద్యోగులు అనారోగ్యం బారిన పడ్డారు. వెళ్లిపోతామని, వీఆర్​ఎస్​ ఇవ్వాలని రిక్వెస్ట్​ చేస్తున్నారు. వీఆర్​ఎస్​ తీసుకోవాలని ఎవరినీ బలవంత పెట్టడం లేదు. ఎంత మంది ఉన్నారో తెలిస్తే ప్రభుత్వంతో మాట్లాడటమా? లేదా వేరే ఏదైనా మార్గముందా? అనే దానిపై ఆలోచన చేస్తాం. ఏదైనా సరే వీఆర్​ఎస్​ తీసుకోవాలనుకుంటున్న వారి లెక్క తేలాకే చర్యలు తీసుకుంటాం.  - సజ్జనార్​, ఆర్టీసీ ఎండీ