
ఈసీకి ఆస్ట్రేలియా హైకమిషనర్ ప్రశంస
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ సమర్థవంతంగా నిర్వహిస్తోందని ఇండియాలోని ఆస్ట్రేలియా రాయబారి హరీందర్ సిధు ప్రశంసించారు. ఆదివారం ఆరో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ను ఆమె పరిశీలించారు. ఢిల్లీలోని పోలింగ్ బూత్ ను సందర్శించారు. ” లోక్ సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు బాగున్నాయి. ఇది నాకు స్ఫూర్తిదాయకమైన అనుభవం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది ఇండియాలో ఎలా ఓటేస్తున్నారు అన్న ప్రశ్నకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లే సమాధానం. ఈవీఎంలు నన్ను ప్రభావితం చేశాయి. మా దేశంలో ఈవీఎంలు వాడట్లేదు. ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ వాడుతున్నాం. ఈవీఎంల వినియోగంతో ప్రజాస్వామ్యంలో నాణ్యత పెరిగింది. వీవీప్యాట్ల వాడకం మంచి పరిణామం, ఇది మంచి విధానం” అని ఆమె అన్నారు. ఆరో విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం 59 సీట్లలో పోలింగ్ జరిగింది. 979 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో రికార్డ్ అయ్యింది. ఈ నెల 19న చివరి విడత పోలింగ్ జరగనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి.