వెదురు ఇండ్లు వెయ్యి రెట్లు బెటర్‌

వెదురు ఇండ్లు వెయ్యి రెట్లు బెటర్‌

ఢిల్లీలో ఓ సదస్సు జరుగుతోంది. ఓ మహిళ ప్రజెంటేషన్ మొదలుపెట్టింది. ఆదిమానవులు నివసించే గుహలు ఎలా ఉండేవో చూపించింది. గుహల నుంచి బయటికి వచ్చి వారు వేసుకున్న గుడారాలను చూపించింది. కాలక్రమంలో ఆ గుడారాలు గుడిసెలుగా, గుడిసెలు ఇండ్లుగా ఎలా మారిపోయాయో చూపించింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కామన్ అయిపోయిన స్టీలు, అద్దాల బిల్డింగ్​లను ప్రదర్శించింది. చిట్టచివరగా.. వెదురు, మట్టి ఇటుకలు, బురదతో కట్టిన ఇండ్లను చూపించింది! దీంతో సదస్సుకు హాజరైనవారంతా ఆశ్చర్యపోయారు. వెదురు, మట్టి, ఇతర లోకల్ గా దొరికే పదార్థాలతో ఇండ్లు, కట్టడాలు నిర్మించుకోవడమే బెటర్ అంటూ అందుకు కారణాలను కూడా ఆమె అరగంట పాటు వివరించింది. ఇటీవల జరిగిన ఆ సదస్సు పేరు ‘వేడ్ ఏసియా కాన్ఫరెన్స్’. ప్రజెంటేషన్ ఇచ్చిన మహిళ బెంగళూరుకు చెందిన ఆర్కిటెక్ట్ నీలం మంజునాథ్.

గవర్నర్ కోసం తొలి ప్రాజెక్ట్

మంజునాథ్‌ లక్నోలో పుట్టి పెరిగారు. గవర్నమెంట్ ఆర్కిటెక్చర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. పెళ్లి తర్వాత బెంగళూరులో స్థిరపడ్డారు. అప్పటి నుంచి వెదురుతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. బాంబూ సొసైటీ ఆఫ్​ఇండియా జాతీయ పాలక మండలి సభ్యురాలు, కర్నాటక చాప్టర్ చైర్మన్‌గా పని చేస్తున్నారు. మనసరమ్ ఆర్కిటెక్ట్స్ సంస్థ కోసం1999లో తొలి ప్రాజెక్టును అప్పటి కర్నాటక గవర్నర్ విఎస్ రమాదేవి కోసం చేపట్టారు. రాజ్ భవన్‌లో వీఐపీలు సేద తీరేందుకు కట్టిన ఓ ఇటుకల బిల్డింగ్ పాడైపోయింది. దీంతో కొత్త బిల్డింగ్ కట్టేందుకు ప్లాన్ ఇచ్చే చాన్స్ నీలంకు దక్కింది. అందుకే ఎలాంటి ఫీజు లేకపోయినా వెదురు ఇల్లును ఆమె డిజైన్ చేశారు.

అందరికీ అందుబాటులోకి తేవాలని

‘‘సిమెంట్, స్టీల్‌తో కట్టిన ఇండ్లు, రేకుల షెడ్లు ఎండాకాలం విపరీతంగా వేడెక్కుతాయి. వానాకాలం తడిసిపోతాయి. చలికాలం చల్లగా మారిపోతాయి. కానీ.. వెదురుతో ఆ సమస్యలు ఉండవు. అందరికీ అందుబాటు ధరల్లో కట్టేందుకు వీలయ్యే అఫోర్డబుల్ హోమ్స్ గురించి రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. వాళ్లు ఒకసారి ఈ ప్లాన్స్ చూస్తే బాగుంటుంది” అని నీలం మంజునాథ్ అంటారు. టెర్రకోట ఇటుకలు, వెదురుతో రకరకాల డిజైన్లను ఆమె సృష్టించారు. అర్కిటెక్ట్ లకు మట్టి, ఖర్చు, సోషియాలజీ, జియాలజీ, స్థానిక వనరుల వంటి విషయాలన్నీ తెలిసి ఉండాలని, కానీ ప్రస్తుతం ఆర్కిటెక్ట్‌లకు అర్థమే మారిపోయిందన్నారు. ఇప్పుడు 3డీ ప్రింటర్లు, సాఫ్ట్ వేర్లు లేనిదే ఆర్కిటెక్ట్‌లు కాలేరన్నట్లు పరిస్థితి తయారైందన్నారు.