తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం చెబుతూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. కాళేశ్వరం, గోదావరి జలాలపై మాట్లాడేందుకు బీఆర్‌ఎస్ కు ఆసక్తి లేదని, సభ నుంచి ఎప్పుడు వెళ్లిపోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం, గోదావరి జలాలపై చర్చిద్దామంటే కేసీఆర్ పారిపోయి ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను తాము చంపాల్సిన అవసరం లేదని.. చచ్చిన పామును ఎవరైనా చంపుతారా అని అన్నారు. కాళేశ్వరంలో అవినీతి బయటపడుతుందని కేసీఆర్ సభకు రాకుండా దాక్కుంటున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం పెడుతుందన్న సీఎం.. కాళేశ్వరంపై చర్చకైనా మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
