- సరైన ఎదుగుదల లేక నష్టపోతామంటున్న మత్స్యకారులు
వనపర్తి, వెలుగు: మత్స్యకారులకు ప్రతి ఏడాది వంద శాతం సబ్సిడీపై అందించే చేప పిల్లల పంపిణీ ఈ ఏడాది ఆలస్యం కావడంతో ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది.
గత ఏడాది సైతం చేప పిల్లల పంపిణీ ఆలస్యం కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు టెండర్లు ఖరారు కాకపోవడంతో పంపిణీ జరగలేదు. ఏటా మే నెలలోనే చేప పిల్లల కోసం టెండర్లు పిలుస్తారు. కానీ, ఈసారి వివిధ కారణాలతో ఆరు నెలలు గ్యాప్ వచ్చింది.
ఆలస్యంగా చేప పిల్లలు పంపిణీ చేస్తే అవి పెరగక నష్టపోతామని మత్సకారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చేప పిల్లలను పంపిణీ చేసి వనపర్తి జిల్లాలో పంపిణీ చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా చేప పిల్లలను పంపిణీ చేయాలని కోరుతున్నారు.
2 కోట్ల చేపపిల్లల పంపిణీ లక్ష్యం..
వనపర్తి జిల్లాలో ఈ ఏడాది రెండు కోట్ల చేపపిల్లలను నీటి వనరుల్లో వదలాలని జిల్లా మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. జిల్లాలోని చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదలడం ద్వారా 142 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని 13,674 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది.
జిల్లాలోని 900 చెరువులు, కుంటల్లో కట్ల, రాహు, బొత్స, బంగారుతీగ వంటి నాలుగు రకాల చేప పిల్లలను వదలనున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఒక ఇంచు నుంచి రెండు, మూడు ఇంచుల పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
స్థానికంగా చేప పిల్లల ఉత్పత్తి లేకపోవడంతోనే..
జిల్లాలోని మదనాపురం మండలకేంద్రంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం సిబ్బంది లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ కేంద్రానికి ఏడీగా వ్యవహరిస్తుండగా, మిగిలిన స్టాఫ్ లేకపోవడంతో అది నిరుపయోగంగా మారింది. ఆరేండ్లుగా ఈ సెంటర్లో సిబ్బందిని నియమించలేదు. దీంతో పెబ్బేరులోని గవర్నమెంట్ ఫిషరీస్ కాలేజీ స్టూడెంట్లకు శిక్షణ కోసం మత్స్య ఉత్పత్తి కేంద్రాన్ని కేటాయించారు.
మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం వినియోగంలోకి వస్తే జిల్లాలోని కొన్ని చెరువుల్లో చేప పిల్లలు వదిలే అవకాశం ఉండేదని అంటున్నారు. మత్స్య ఉత్పత్తి కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి చేప పిల్లలను ఉత్పత్తి చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
త్వరలో పంపిణీ చేస్తాం..
చేప పిల్లలు పంపిణీ చేసేందుకు టెండర్లు పిలిచాం. టెండర్లు ఖరారు కాగానే చేప పిల్లల పంపిణీ ప్రారంభిస్తాం. ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ కొంత ఆలస్యమైంది. లక్ష్మప్ప, జిల్లా మత్స్యశాఖ అధికారి

