వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) పిలుపునిచ్చారు. ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తకోట పట్టణంలో వనపర్తి చౌరస్తా నుంచి ఏటీఆర్ కన్వెన్షన్ వరకు 2కే రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ నియంత్రణ కోసం ‘ఈగల్’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సీరియస్‌గా కృషి చేస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ చుట్టుపక్కల జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు అలర్ట్‌గా ఉండాలన్నారు. ఎస్పీ సునీతా రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని, డ్రగ్స్ సమాచారం తెలిస్తే వెంటనే 1908 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యా సంస్థలు, గ్రామాల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
