- క్వింటాల్‌పై రూ.800 తక్కువకు కొనుగోలు
- ఇంకా ప్రారంభం కాని ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు
- నిండా మునుగుతున్న రైతులు
వనపర్తి, వెలుగు:వనపర్తి మార్కెట్లో వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. క్వింటాల్‌పై ఏకంగా రూ.800 వరకు తక్కువ చెల్లించడంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. పంట చేతికి వచ్చినప్పటికీ ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు నిండా మునుగుతున్నారు. వనపర్తి జిల్లాలో ఈసారి గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు 15క్వింటాళ్ల వరకు దిగుబడి రావడంతో రైతులు ఆనందంగా ఉండగా, వ్యాపారులు సిండికేట్ గా మారి ధర తగ్గించడంతో మద్దతు ధర దక్కక నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది.
క్వింటాల్‌కు రూ.800 తక్కువ ఇస్తున్రు..
ఈ నెల 5 నుంచి వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మార్కెట్ యార్డులో మక్క రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర దక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వం మక్కలకు క్వింటాల్‌కు రూ.2,400 కనీస మద్దతు ధర ప్రకటించింది. కానీ, ఈ ధర రైతులకు దక్కడం లేదు. యార్డులో కనిష్ఠ, గరిష్ఠ, మాడల్ ధరలు ప్రతి రోజూ ప్రకటిస్తారు. ఇలా ఇప్పటి వరకు కనిష్ట ధర రూ.1,600, గరిష్ట ధర రూ.2 వేలు పలికింది.
కనీస మద్దతు ధర మాత్రం పలకలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వనపర్తితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన మార్కెట్లలో ఎక్కడా కనీస మద్దతు ధర పలకకపోవడం గమనార్హం. ఈ నెల 16న నాగర్‌కర్నూల్ మార్కెట్లో గరిష్ట ధర రూ.2,169 పలికింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇదే గరిష్ట ధర కావడం గమనార్హం.
కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతోనే..
జిల్లాలో ఎక్కడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరకపోవడంతో రైతులు గత్యంతరం లేక మార్కెట్ యార్డుకు మక్కలు తీసుకొస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు సిండికేట్‌గా మారి మక్కలకు ధర పెట్టడం లేదు. జిల్లాలో ఈ సీజన్లో 22,500 ఎకరాల్లో మక్కలు సాగు చేశారు. జిల్లాలోని వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లోనే ఎక్కువగా ఈ పంట సాగు చేశారు. వాతావరణం సహకరిస్తే ఎకరానికి 22 నుంచి 25 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తుంది. ఈసారి ఎలాంటి చీడపీడలు లేకపోవడంతో సగటున 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. కొన్ని మండలాల్లో అంత కంటే ఎక్కువగా వస్తోంది.
