
వనపర్తి, వెలుగు: జిల్లాలో రైస్‌మిల్లర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. పెండింగ్ సీఎంఆర్ క్లియర్ చేయాలని అధికారులు సమావేశాలు పెట్టి గడువు విధిస్తున్నా మిల్లర్లు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 180వరకు రైసుమిల్లులున్నాయి. గతంలో సీఎంఆర్ ధాన్యం తీసుకుని బియ్యం అప్పగించని మిల్లర్లకు ఈ సీజనులో ధాన్యం కేటాయించలేదు. కేవలం 51మంది మిల్లర్లకే సీఎంఆర్ ధాన్యం కేటాయించారు. అలా కేటాయించినా 40శాతం మిల్లర్లు ఇంకా బియ్యం ఇవ్వలేదు.
నామ్‌కే వాస్తే దాడులు
జిల్లాలోని పలు మిల్లులపై సివిల్ సప్లయ్, విజిలెన్స్ అండ్ ఎన్స్ఫోర్సుమెంటు అధికారులు దాడులు నిర్వహించి శాంపిల్స్ తీసుకెళ్తున్నా ఫలితం ఉండడంలేదు. దాడులు చేయడం, శాంపిల్స్ తీసుకెళ్లడం రొటీనేకదా అన్న భావన మిల్లర్లలోనూ నెలకొంది. గతంలో 6ఎ కేసులైనా ఆయా మిల్లర్లు వారి సమీప బంధువుల పేర్లమీద సీఎంఆర్ కేటాయింపులు చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
నిరుటి ఖరీఫ్ పెండింగ్ 40శాతం
2023–24 ఖరీఫ్ సీజనుకు గాను జిల్లాలోని 51 రైసుమిల్లర్లకు లక్ష43 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం కేటాయించారు. వారు ఈ మొత్తానికి గాను 96వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. కాని, ఇప్పటి వరకు మిల్లర్లు ఇచ్చింది 61 వేల మెట్రిక్ టన్నులే. ఇంకా 34 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందించాలి. అంటే ఇంకా 40శాతం బియ్యం పెండింగులో ఉందన్నమాట. గత కొన్నాళ్లుగా ప్రభుత్వం సివిల్ సప్లయ్‌శాఖ ద్వారా రైస్‌మిల్లర్లకు సీఎంఆర్ ధాన్యం కేటాయిస్తుండగా చాలామటుకు మిల్లర్లు రేషను బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్‌గా ఇస్తూ వస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలలో అమ్ముకుంటున్నారు.
ఈ సారి ప్రభుత్వం రేషను షాపుల ద్వారా కార్డుదారులకు సన్నబియ్యం పంపిణి చేస్తుండడంతో లబ్దిదారులు ఆ బియ్యాన్నే తింటున్నారు. వాటిని అమ్ముకునేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఫలితంగా రేషను బియ్యం విక్రయానికి రెక్కలొచ్చి కిలో రూ.20వరకు బ్లాక్‌లో ధర పలుకుతోంది. మిల్లర్లకూ ఆ బియ్యం సేకరణ బాగా తగ్గిపోయింది. అయినా సీఎంఆర్ ధాన్యాన్ని పొందిన మిల్లర్లు చాలా మంది బయటి రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. అలా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ ఇటీవల పెబ్బేరులో సీసీఎస్ పోలీసులకు లారీలు పట్టుబడ్డ సంగతి తెలిసిందే.