మేడ్చల్ లో 300..గజ్వేల్ లో 200 నామినేషన్లు వేస్తం

మేడ్చల్ లో 300..గజ్వేల్ లో 200 నామినేషన్లు వేస్తం
  •     సమస్యలను పరిష్కరించని మల్లారెడ్డిని ఓడిస్తం
  •     ఐదేళ్లుగా పట్టించుకోలేదు
  •     బోడుప్పల్, ఘట్​కేసర్ వక్ఫ్ బోర్డు బాధితుల జేఏసీ వెల్లడి

ఖైరతాబాద్, వెలుగు : బోడుప్పల్, ఘట్ కేసర్ లోని ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరించకపోతే మేడ్చల్ సెగ్మెంట్ లో 300, గజ్వేల్ లో 200 మందితో నామినేషన్లు వేయిస్తామని వక్ఫ్ బోర్డు బాధితుల జేఏసీ ప్రకటించింది. గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్ శ్రీధర్​రెడ్డి, కో చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. 2016, బోడుప్పల్​లో ఏబీ మధురానగర్ పేరుతో ఏర్పాటు చేసిన అప్రూవుడ్ లే ఔట్​లో స్థలాలు కొని చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామన్నారు. బ్యాంకు నుంచి లోన్ తీసుకుని నిర్మాణాలు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు.

లాయర్లు, రెవెన్యూ ఎంప్లాయీస్ కూడా స్థలాలు కొనుగోలు చేసినట్లు వివరించారు. రియాజుద్దీన్ అనే వ్యక్తి ఆ భూమి వక్ఫ్ బోర్డుది అంటూ 2018లో ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ఆపేసిందన్నారు. నిబంధనల ప్రకారం అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాకే రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని బాధితులు తెలిపారు. ఈ సమస్య మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారిస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఐదేండ్లు అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు.

పసుపు బోర్డు సాధన కోసం నిజామాబాద్​లో ఎలా అయితే రైతులు నామినేషన్లు వేశారో.. అలాగే, మేడ్చల్ అసెంబ్లీకి 300, గజ్వేల్ అసెంబ్లీకి 200 నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. హైకోర్టుకు కూడా వెళ్లామన్నారు. మంత్రి మల్లారెడ్డిని ఓడించడమే తమ ధ్యేయమని హెచ్చరించారు.