హరీశ్, ఈటల మధ్య మాటల యుద్ధం

హరీశ్, ఈటల మధ్య మాటల యుద్ధం

గోరీ కడ్తనంటవా?ఆయన లేకుండా ఎదుగుతుంటివా?నిన్ను కుడిభుజానివి, తమ్మునివి అన్నడు ఎమ్మెల్యేను,  మంత్రిని చేసి పెద్ద చేసిండు నన్ను పట్టుకుని గాడు, గీడంటవా?
ఈటలకు విశ్వాసం లేదు. తమ్ముడని, కుడిభుజమని ఆకాశమంత ఎత్తుకు ఎత్తుకున్న సీఎం కేసీఆర్​కు గోరీ కడ్తనంటున్నడు. నన్ను కూడా వాడు, వీడని మాట్లాడుతున్నడు. రాజకీయ అక్షరాలు నేర్పి, ఆరుసార్లు ఎమ్మెల్యేను, తర్వాత మంత్రిని చేసి ఈ స్థాయికి తెచ్చిన్రు. ఇప్పుడిట్ల మాట్లాడుతుండంటె ఈటలకు ఏం విశ్వాసమున్నట్టు? నీ మాటలకు అర్థమున్నదా? కేసీఆర్ ​లేకుంట నువ్వు వద్దువా? సంస్కారముండాలె.

‑ హరీశ్​రావు

జమ్మికుంట, వెలుగు:‘‘ఈటలకు విశ్వాసం లేదు. తమ్ముడని, కుడిభుజమని ఆకాశమంత ఎత్తుకు ఎత్తుకున్న సీఎం కేసీఆర్​కు గోరీ కడ్తనని మాట్లాడుతున్నడు. నన్ను కూడా వాడు, వీడని సంస్కారం లేకుండా మాట్లాడుతున్నడు” అని ఆర్థిక మంత్రి హరీశ్​రావు విమర్శించారు. ‘‘హుజూరాబాద్​లోని శాలపల్లిలో రైతు బంధు పథకం ప్రారంభమప్పుడు ఈటల గురించి కేసీఆర్ ఎంతో గొప్పగా మాట్లాడిన్రు. తన తమ్ముడని,  కుడి భుజమని గొప్పగా చెప్పిన్రు. రాజకీయ అక్షరాలు నేర్పి, ఆరుసార్లు ఎమ్మెల్యేను, తర్వాత మంత్రిని చేసి ఈ స్థాయికి తెచ్చిన్రు. ఇప్పుడిట్ల మాట్లాడుతుండంటె ఈటలకు ఏం విశ్వాసమున్నట్టు?’’ అని ప్రశ్నించారు. ‘నీ మాటలకు అర్థమున్నదా? కేసీఆర్​లేకుంట నువ్వు వద్దువా? సంస్కారముండాలె’’ అని ఈటలపై ఫైరయ్యారు. గురువారం జమ్మికుంట మండల కేంద్రంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ మాట్లాడారు. ఈటలకు కేసీఆరే రాజకీయ గురువని, ఎన్నో అవకాశాలిచ్చి ఈ స్థాయికి తెచ్చారని అన్నారు. టీఆర్ఎస్​కూడా ఆయనకు అన్యాయమూ చేయలేదని, అన్నివిధాలా అండగా నిలిచిందని చెప్పారు. ‘2004 ఎన్నికలప్పుడు రాజకీయాల్లో ఆరితేరిన దామోదర్​రెడ్డి మీద  పోటీ చేసేనాటికి ఈటల ప్రజాప్రతినిధీ కాదు. సామాజిక, సేవ కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తీ కాదు. అయినా ఆయనకు కేసీఆర్​అవకాశమిచ్చి నిలబెట్టిన్రు. రైతుబంధు పథకం ప్రారంభానికి హుజూరాబాద్​నియోజకవర్గంలోని శాలపల్లిని ఎంచుకొని ఈటల గెలుపుకు కారణమైన్రు. అన్నివిధాలా లబ్ధి పొందిన ఈటల నేడు కేసీఆర్​పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నరు’ అని ఫైరయ్యారు. ‘ఈటల భాషను, శైలిని సభ్యసమాజం ఒప్పుకుంటదా? నన్ను గాడు, గీడు అన్నా నేను మాత్రం ఈటల రాజేందర్​గారు అని మాత్రమే సంబోధిస్త” అన్నారు.

సత్తా ఉంది కాబట పదవులొచ్చినయ్​

ఈటలకు పదవులు ఇచ్చినం, పెద్దోన్ని చేసినమంటున్నరు. నాకు సత్తా ఉంది గనుకనే ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్, మంత్రి పదవులొచ్చినై. 18 ఏండ్లలో ఏ బాధ్యత ఇచ్చినా సమర్థంగా పని చేసిన.. రాజేందర్​ గెలిస్తే ఏం చేస్తడంటున్నరు. నేను రాజీనామా చేస్తే రెండే నెలల్ల 200 కోట్ల పనులు చేసిన్రు. కొత్తగా పింఛన్లు, రేషన్​కార్డులు, దళితబంధు వచ్చినై. మల్ల గెలిస్తే తెలంగాణ రాజకీయ రూపురేఖలే మారుతై.
‑ ఈటల రాజేందర్
జమ్మికుంట/హుజూరాబాద్​ టౌన్, వెలుగు: కేసీఆర్​కు అప్పుడు తమ్ముడిలా, కుడిభుజంగా కనిపించిన తాను, ఇప్పుడు దయ్యంలా, వర్గ శత్రువులా ఎందుకు కనిపిస్తున్నానో చెప్పాలని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. తాను ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లూ కట్టలేదని, ఒక్క రోడ్డూ వెయ్యలేదంటున్న హరీశ్​రావు జీవితమే అబద్ధాలమయమన్నారు. ఇలాంటి ద్రోహుల మాటలు విని జనం మోసపోద్దన్నారు. ‘‘కొందరు నేను టీఆర్ఎస్ ల మధ్యలో చేరిన్నంటున్నరు. పార్టీ చరిత్ర 20 ఏండ్లయితే  అండ్ల నాది 18 ఏండ్ల చరిత్ర. రాజేందర్​ గెలిస్తే ఏం చేస్తడంటున్నరు. నేను రాజీనామా చేస్తే రెండే నెలల్ల రూ.200 కోట్ల అభివృద్ధి పనులు జరిగినై. కొత్తగా పింఛన్లు, రేషన్ ​కార్డులు, దళితబంధు వచ్చినై. మల్ల గెలిస్తే తెలంగాణ రాజకీయ రూపురేఖలే మారుతై’’ అని అన్నారు. కరోనా పేషెంట్లను కాపాడే పనిలో తానుంటే, మంచి పేరొస్తున్నదనే ఈర్ష్యతో భూ కుంభకోణం ఆరోపణలతో బయటకు పంపిన సిగ్గుమాలిన, దరిద్రపు సీఎం కేసీఆర్ అంటూ ఫైరయ్యారు. అప్పుడు తనతో కలిసి పనిచేసిన హరీశ్​రావు ఇప్పుడు మరో అవతారమెత్తారని ఎద్దేవా చేశారు. ‘‘ఈటలకు పదవులు ఇచ్చినం, పెద్దోన్ని చేసినమంటున్నరు. నాకు సత్తా ఉంది గనుకనే ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్, మంత్రి పదవులొచ్చినై. 18 ఏండ్లలో ఏ బాధ్యత ఇచ్చినా సమర్థంగా పని చేసిన” అన్నారు. గురువారం జమ్మికుంటలో వడ్డెర కులస్థుల ఆత్మీయ సమావేశంలో, హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో ప్రచారంలో ఈటల మాట్లాడారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారంటూ కేసీఆర్​పై దుమ్మెత్తిపోశారు. ‘‘బానిసలాగా తన చెప్పు చేతల్లో ఉంటే కేసీఆర్​ శభాష్​ బిడ్డ అంటడు. నాలాంటి ప్రశ్నించే గొంతుకులను వెళ్లగొడ్తడు. ఆయన దూపైనప్పుడు బాయి తొవ్వుకునే బాపతు. ఎన్నికలప్పుడే జనం గుర్తుకొస్తరు. అంబేడ్కర్ గుర్తుకొస్తరు. ఐదు నెలలుగా హుజూరాబాద్ రాజకీయాలు తప్ప ఇంకేం పట్టించుకుంటలేడు. వరదల గురించి మాట్లాడడు.  నిరుద్యోగులకు ఉద్యోగాలియ్యడు.  ప్రగతి భవన్ ల కూర్చొని ప్రజల కోసం పని చెయ్యడు గని కుట్రలు చేస్తడు. పాలన వదిలేసి, నన్నెట్ల ఓడించాల్నా అని కుట్రలు పన్నుతున్నడు. దళిత బంధు వద్దంటూ ఈసీకి నేను ఫిర్యాదు చేసినట్లు దొంగ లెటర్లు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నరు’’ అంటూ ఫైరయ్యారు. సీఎం కుర్చీకి హరీశో, కేటీఆరో, కవితో, సంతోషో ఎసరు పెడతారు గానీ తనకు ఆ అవసరం లేదన్నారు.

వడ్డెర్లపై ఒత్తిడి తెస్తున్నరు

టీఆర్ఎస్ లో చేరాలని హుజూరాబాద్ లో వడ్డెరలపై ఒత్తిడి తెస్తున్నారని ఈటల ఆరోపించారు. లేదంటే జేసీబీలు, ట్రాక్టర్లు నడవనియ్యబోమని బెదిరిస్తున్నారన్నారు. అయినా వాళ్లంతా తన వెంటే ఉన్నందుకు కృతజ్ఞతలన్నారు. ‘‘తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి,  ప్రగతిభవన్​అహంకారానికి ఈ నెల 30న ఎన్నిక జరుగుతున్నది. ఓట్ల రూపంలో గుద్దుడు గుద్దితే దిమ్మ తిరగాలె. 2023లో టీఆర్ఎస్​పతనం తప్పదు. రాష్ట్రంపై కాషాయ జెండా ఎగురుడు ఖాయం. హుజూరాబాద్ ప్రజల తీర్పు ఆ దిశగా ఉండనుంది. టీఆర్ఎసోళ్లు పంచుతున్నది కేసీఆర్, ఆయన బిడ్డ, కొడుకు కూలి పని, వ్యాపారం చేసి సంపాదించిన డబ్బు కాదు. అక్రమంగా సంపాదించుకున్న కాళేశ్వరం డబ్బు. ఓటుకు 20 వేలిచ్చినా మీరు మాత్రం పువ్వు గుర్తుకే వెయ్యాలె” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ దళితబంధు ఇవ్వాలని, వడ్డెరలతో పాటు సంచార జాతులకు పథకాలు తేవాలన్నారు.