హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు.
డిసెంబర్ 17న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం (డిసెంబర్ 15) జైపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి వివేక్ క్యాంపెయినింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తోన్న ఏకైక రాష్ట్ర తెలంగాణ అని అన్నారు. 10 ఏండ్లుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులను అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇచ్చామని చెప్పారు. జైపూర్ పవర్ ప్లాంట్లో కొత్తగా 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్ను నిర్మించనున్నారని.. అందులో స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చెన్నూర్లో ఏటీసీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేసిందన్నారు. ప్రతీ ఒక్క అర్హుడికి సంక్షేమ పథకాలు అందజేస్తుందని తెలిపారు.
