మూడు పార్టీలకు సవాలే

మూడు పార్టీలకు సవాలే

మున్సిపల్​ ఎలక్షన్స్​ను మూడు ప్రధాన పార్టీలు సవాల్​గా తీసుకున్నాయి. వ్యూహాత్మకంగా కదులుతున్నాయి. ఈ పరుగులో అధికార పార్టీ టీఆర్​ఎస్​ కొంచెం ముందంజలో ఉండగా.. ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్​ సైతం దూకుడు మొదలుపెట్టాయి. పోలింగ్​కు పట్టుమని 23 రోజుల టైమ్​ కూడా లేకపోవడంతో వేగంగా అడుగులు వేస్తున్నాయి. జులై నుంచి టీఆర్​ఎస్​ మున్సిపల్‌‌‌‌ ఎన్నికలకు సమాయత్తమవుతూనే ఉంది. ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి ఏమిటో ఇప్పటికే ఆరుసార్లు సర్వే చేయించుకొని, ప్రజల మూడ్‌‌‌‌ ఎట్లుందో పసిగట్టే ప్రయత్నం చేసింది. ఈ ఎన్నికలను బీజేపీ కూడా సీరియస్‌‌‌‌గా తీసుకొని గ్రౌండ్‌‌‌‌ వర్క్ షురూ జేసింది. కాంగ్రెస్‌‌‌‌ సైతం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. పార్టీలన్నీ ప్రజల మూడ్​ను ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా తెలుసుకుంటూనే  వ్యూహాలను అమలు చేస్తున్నాయి.

రాష్ట్రంలో రెండోసారి టీఆర్‌‌ఎస్‌‌ పాలన పగ్గాలు చేపట్టిన ఏడాది తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. అచ్చంగా అర్బన్​ ఓటర్లు ఇచ్చే తీర్పు ఇది. అర్బన్‌‌  ఓటర్లలో ఎడ్యుకేటెడ్, మిడిల్​క్లాస్​ ప్రజలు ఎక్కువగా ఉండటం, ప్రాంతీయ పార్టీలతోపాటు జాతీయ పార్టీల ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో తీర్పు ఎట్లుండబోతుందన్నది ఆసక్తిగా మారింది. దీంతో మూడు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

రిజర్వేషన్లతో సంబంధం లేకుండానే

ఓటర్ల లిస్టు, రిజర్వేషన్లు ఫైనల్​ కాకపోముందే ఎన్నికల షెడ్యూల్​ప్రకటించడం వివాదాస్పదమైంది. దీనిపై శనివారం జరిగిన రాష్ట్ర ఎన్నికల కమిషన్​ సమావేశంలో ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. షెడ్యూల్​ను మార్చాలని పట్టుబట్టాయి. పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్​ను మార్చేది లేదని కమిషన్​ స్పష్టం చేసింది. దీంతో వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లతో సంబంధం లేకుండానే ప్రధాన పార్టీలు విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్నాయి. ఒక్కో వార్డులో ఏ రిజర్వేషన్‌‌ వస్తే ఎవరికి టికెట్‌‌ ఇవ్వాలనే విషయమై పార్టీ ఇన్‌‌చార్జులతో టీఆర్‌‌ఎస్‌‌ సమావేశాలు నిర్వహిస్తూ సమాచారం సేకరిస్తోంది. టికెట్ల కేటాయింపుపై ఇప్పటికే ఆ పార్టీ గ్రౌండ్​లెవల్​లో సర్వే కూడా చేయించింది. వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లపై టీఆర్‌‌ఎస్‌‌లోనూ స్పష్టత లేకున్నా మున్సిపల్‌‌ చైర్మన్లు, కార్పొరేషన్​ మేయర్ల రిజర్వేషన్లపై కచ్చితమైన అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ ఆశించిన స్థాయిలోనే రిజర్వేషన్లు ఉండే అవకాశం ఉంది. రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్​ కూడా ఓ అంచనాతో ఉన్నట్లు తెలుస్తోంది. పది కార్పొరేషన్ల మేయర్లతోపాటు పెద్ద మున్సిపల్‌‌ చైర్మన్‌‌ పదవులకు ఎవరెవరికి రిజర్వ్‌‌ కావచ్చో ఇప్పటికే స్థానికంగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు ప్రచారంలో ఉన్న రిజర్వేషన్లే 90 శాతం ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే ప్రధాన పార్టీలు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.

ముందు నుంచే టీఆర్​ఎస్​ ప్లాన్​

మున్సిపల్​ ఎన్నికలపై టీఆర్​ఎస్​ ముందు నుంచే వ్యూహాలు అమలు చేస్తోంది. జూలై నుంచే ఆ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతూ వస్తోంది. పార్టీ పరిస్థితిపై పలుదఫాలు సర్వే చేయించుకుంది. మరోసారి సర్వే కోసం టీఆర్​ఎస్​ మున్సిపోల్స్​ ఇన్​చార్జులకు పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఇటీవల ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆయన ట్విట్టర్‌‌లో ‘‘ఆస్క్‌‌ కేటీఆర్‌‌’’ పేరిట నెటిజన్లతో సంభాషిస్తున్నారు. ఎప్పటికప్పుడు పబ్లిక్​ మూడ్​ను అంచనా వేసుకుంటున్నారు. మంత్రులు, కీలకనేతలంతా జిల్లాల్లో ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు. టీఆర్​ఎస్​ మహిళా విభాగం నేతలు ఉప్పల్‌‌లో  మహిళా గర్జన నిర్వహించి ప్రచారాన్ని మొదలుపెట్టారు. మున్సిపోల్స్‌‌ లో మొదటి నుంచి టీఆర్​ఎస్​.. జిల్లా, మండల పరిషత్‌‌ ఎన్నికల ఫార్ములానే అమలుపరుస్తున్నట్టు కనిపిస్తోంది. అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎట్లనైనా గెలువాలని తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌‌ను హడావుడిగా ప్రకటించడం మొదలు రిజర్వేషన్ల వరకు వ్యూహాత్మకంగా నడుచుకుంటోంది. ప్రతిపక్ష పార్టీల్లోని బలమైన నేతలను ఎలాగైనా తమవైపు తిప్పుకునేందుకు టీఆర్​ఎస్​లోని కీలక నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేరుగా వారితో ఫోన్‌‌లో మాట్లాడి తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా కేటీఆర్​.. ఎవరు పార్టీలోకి వచ్చినా చేర్చుకోవాలని ఇన్​చార్జులకు ఆదేశిం చినట్లు సమాచారం. వలసల ద్వారా ప్రతిపక్షాలను ఇరుకునపెట్టొచ్చని అధికార పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ మొన్నటి లోక్​సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం నుంచి బయటపడాలని టీఆర్​ఎస్​ ప్రయత్నిస్తోంది. మున్సిపల్​ ఎలక్షన్​ను సవాల్​గా తీసుకొని పట్టు నిలుపుకోవాలని చూస్తోంది.

కాంగ్రెస్‌‌  కసరత్తు

కాంగ్రెస్‌‌ ఇప్పటికే ఎన్నికలపై కమిటీ ఏర్పాటు చేసింది. అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై చర్చిస్తోంది. జిల్లాలవారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది. రిజర్వేషన్లు తేలగానే క్యాండిడేట్లను ప్రకటించేందుకు రెడీ అవుతోంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎక్కువ మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేసిన కాంగ్రెస్​.. ఇప్పుడు ఎలాగైనా వాటిని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.  అయితే.. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు కేడర్​ను కలవరపెడుతున్నాయి. ఎన్నికల సన్నాహక సభకు కీలక నేతలే డుమ్మా కొట్టారు. అధికార పార్టీలో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టికెట్​ దక్కనివారిని తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న దశలోనూ ఎలక్షన్లు వాయిదా పడుతాయా అంటూ కాంగ్రెస్​లోని కొందరు ముఖ్య నేతలు ఆరా తీయడం కేడర్​ను ఆగ్రహానికి గురిచేస్తోంది.