- 1,837 పాయింట్లు పడ్డ సెన్సెక్స్
- యుద్ధం వల్ల ఇప్పటి వరకు రూ.48 లక్షల కోట్లు ఆవిరి
- ట్రంప్ అల్టిమేటంతో మార్కెట్లు ఢమాల్
- 94 దాటిన రూపాయి
ఇరాన్‌కు ట్రంప్ 48 గంటల అల్టిమేటంతో మార్కెట్లు సోమవారం భారీగా పడ్డాయి. సెన్సెక్స్ 1,837 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 602 పాయింట్లు తగ్గి 22,513 వద్ద సెటిలైంది. ఇన్వెస్టర్లు మరో
రూ.14 లక్షల కోట్లు నష్టపోయారు.
ముంబై: ఇన్వెస్టర్లు మరో రూ.14 లక్షల కోట్లు నష్టపోయారు. మార్కెట్ సోమవారం రెండున్నర శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.414.77 లక్షల కోట్లకు పడిపోయింది. ఇరాన్– అమెరికా యుద్ధం వల్ల ఇప్పటివరకు దాదాపు రూ.48 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది.
యుద్ధానికి ముందు బీఎస్‌ఈలోని కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.463 లక్షల కోట్లుగా ఉంది. హార్మూజ్ జలసంధి తెరవడంపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్‌కు 48 గంటల అల్టిమేటం ఇవ్వడంతో సెన్సెక్స్ సోమవారం 1,837 పాయింట్లు క్రాష్ అయ్యింది. 72,696 వద్ద ముగిసింది. నిఫ్టీ 602 పాయింట్లు (2.60 శాతం) తగ్గి 22,513 వద్ద సెటిల్ అయింది. నిఫ్టీలో టైటాన్, ట్రెంట్ షేర్లు 6శాతం వరకు పడ్డాయి.
అల్ట్రాటెక్ సిమెంట్, బెల్, ఇండిగో, టాటా స్టీల్ 5 శాతం తగ్గాయి. హెచ్‌సీఎల్ టెక్ మాత్రమే 2శాతం లాభంతో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోని అన్ని సెక్టార్ల ఇండెక్స్‌లు రెడ్‌లో ముగిశాయి. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, రియల్టీ 5 శాతం వరకు పడ్డాయి. 3,008 స్టాక్స్ నష్టపోగా, 332 పెరిగాయి, 80 స్థిరంగా ఉన్నాయి. ‘‘నిఫ్టీ 22,950–-23,000 సపోర్ట్‌ను బ్రేక్ చేసింది. షార్ట్-టర్మ్‌లో 22,700–-22,400కి జారొచ్చు. రెసిస్టెన్స్ 23,862 దగ్గర ఉంది. ట్రెండ్ బేరిష్‌గా ఉంది. ఇరాన్– అమెరికా యుద్ధం, ఆయిల్ ధరలు పెరగడం, ఎఫ్‌ఐఐల అమ్మకాల వల్ల మార్కెట్‌లో వోలటాలిటీ ఎక్కువగా ఉంది”అని ఎల్‌కేపీ సెక్యూరిటీఎస్ ఎనలిస్ట్ రూపక్ డే అన్నారు.
మార్కెట్ పతనానికి కారణాలు..
ఇరాన్-యూఎస్ యుద్ధం : యుద్ధం నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ట్రంప్ ఇరాన్‌కు 48 గంటల అల్టిమేటమ్ ఇచ్చారు. హార్మూజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడి చేస్తామని వార్నింగ్ ఇవ్వగా, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ జలసంధిని పూర్తిగా మూసేస్తామని హెచ్చరించారు. ఘర్షణలు తగ్గే సంకేతాలు కనిపించకపోవడంతో మార్కెట్ భారీగా పడింది.
పెరిగిన ఆయిల్ ధరలు: హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల బ్రెంట్ క్రూడాయిల్ ధర 113 డాలర్లకి చేరింది. జల సంధిని పూర్తిగా మూసేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ధరలు మళ్లీ పెరిగాయి.
రూపాయి ఆల్- టైమ్ లో: డాలర్‌తో రూపాయి విలువ 94 దాటింది. ఇంట్రాడేలో 50 పైసలు క్షీణించి 94.03 వద్ద కొత్త ఆల్ టైమ్ లో ని నమోదు చేసింది. చివరికి 93.53 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి విలువ 3శాతం పడిపోయింది. ఆయిల్ ధరలు పెరగడంతో ఇండియా దిగుమతుల ఖర్చు పెరుగుతోంది. దీంతోపాటు విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) దేశం విడిచి వెళ్లిపోతుండడంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది.
ఎఫ్‌ఐఐల అమ్మకాలు: ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) సోమవారం సెషన్‌లో మరో రూ. 10,400కోట్ల విలువైన షేర్లను అమ్మారు. గత సెషన్‌లో నికరంగా రూ.5,518 కోట్ల షేర్లను విక్రయించారు. గత 16 సెషన్లలో రూ.57,169 కోట్లను మార్కెట్ నుంచి విత్‌డ్రా చేసుకున్నారు. ఎఫ్‌ఐఐలు భారీగా షేర్లను అమ్మేస్తుండడంతో మార్కెట్ పడుతోంది. యూఎస్ 10 ఏళ్ల ట్రెజరీ యీల్డ్ 4.255 శాతానికి పెరగడంతో ఎఫ్‌ఐఐలు ఇండియా నుంచి వెళ్లిపోతున్నారు.
నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు: ఆసియా మార్కెట్లు సోమవారం భారీగా పడ్డాయి. సౌత్ కొరియా కోస్పి 7 శాతం, జపాన్ నిక్కీ 4శాతం, హాంకాంగ్ హంగ్ సెంగ్ 3.6 శాతం క్రాష్ అయ్యాయి. యూరప్ మార్కెట్లు 2 శాతం వరకు తగ్గాయి.
ఇండస్ట్రియల్ డీజిల్ ధర పెంపు: ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇండస్ట్రియల్ డీజిల్ ధరను లీటర్‌కు రూ.22 పెంచాయి. క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. రైల్వే, మైనింగ్, ఇన్‌ఫ్రా, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలపై ప్రభావం పడుతుంది.
- గిఫ్ట్ నిఫ్టీ 3 శాతం జూమ్..
ఇరానియన్ పవర్ ప్లాంట్లపై దాడులను వాయిదా వేస్తున్నామని ట్రంప్ ప్రకటించడంతో గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ సోమవారం సాయంత్రం 3 శాతానికి పైగా లాభపడ్డాయి. 23,400 దగ్గర ట్రేడయ్యాయి. ట్రంప్ కామెంట్స్‌తో ఆయిల్ ధరలు కూడా షార్ప్‌గా పడ్డాయి. మార్నింగ్ సెషన్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 113 డాలర్ల దగ్గర కదలగా, సాయంత్రం 10 శాతం వరకు పడి 99 డాలర్లకు దిగొచ్చింది. మార్కెట్ మంగళవారం 3 శాతానికి పైగా లాభంతో ఓపెన్ అవుతుందని అంచనా.
