జగదీశ్ ఖబడ్దార్ .. పార్టీ మారారన్న వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఫైర్

జగదీశ్ ఖబడ్దార్   ..  పార్టీ మారారన్న వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం సాగింది. గురువారం అసెంబ్లీలో విద్యుత్​శాఖపై వైట్ పేపర్ ప్రవేశపెట్టిన సందర్భంగా నువ్వా నేనా అన్నట్లుగా వాగ్వాదం సాగింది. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారారంటూ జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ‘‘మా అన్నదమ్ముల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడింది బీఆర్ఎస్ వాళ్లు. నేను పార్టీ మారింది ప్రజల కోసం. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లాను. వాళ్లలాగా కాంగ్రెస్‌‌లో గెలిచిన 12 మందిని కొనేసి.. ప్రతిపక్షం లేకుండా చేసి.. ప్రజాస్వామ్యాన్ని మేం ఖూనీ చేయలేదు. మా గురించి మాట్లాడేటప్పుడు ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత దాడి చేస్తే ఊరుకునేది లేదు’’ అని హెచ్చరించారు.

 ‘‘పార్టీ మారారని అంటున్నారు. నేను ఏ పార్టీలో ఉన్నా.. ఈ కుటుంబ, నియంత పాలనను అంతమొందించడమే నా లక్ష్యం. తెలంగాణ సమాజం కాంగ్రెస్ వైపు చూస్తే.. నేను కాంగ్రెస్​లోకి వచ్చాను. నాలాంటి వ్యక్తి మళ్లీ కాంగ్రెస్​లోకి వాపస్ వచ్చిండంటే మీ పనైపోయిందని అర్థం కాలేదా? నేను కాంగ్రెస్​లోకి వచ్చాక మీరు ప్రతిపక్షంలోకి పోయింది నిజం కాదా? నేను పార్టీ మారింది ప్రజల కోసం. వారిలాగా పదవుల కోసం డబ్బుల కోసం ఆశపడేవాళ్లం కాదు. వంగివంగి దండాలు పెట్టేవాళ్లం కాదు. జీహుజూర్ అంటూ మీ మాజీ ముఖ్యమంత్రి దగ్గర వంగి దండాలు పెట్టలేదు. కేసీఆర్ ముందు నోరు మెదపలేని వాళ్లు వీళ్లు. విద్యుత్, నీటిపారుదల ప్రాజెక్టులపై అప్పటి సీఎం కేసీఆర్ ముందు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కనీసం మాట్లాడలేని పరిస్థితి ఉండేది. ధైర్యంగా చెప్పలేకపోయారు కాబట్టే రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ ముందు మాట్లాడే ధైర్యం ఉందా మీకు? మా ముఖ్యమంత్రికి మేం సలహాలు ఇవ్వగలం. ఏ సమస్య వచ్చినా.. ఏ నిర్ణయం తీసుకున్నా.. తప్పైతే తప్పని చెప్పగల శక్తి, నిర్ణయాన్ని మార్పించగల శక్తి మాకుంది. మీకుందా? నియంతలాగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి గొంతు లేకుండా చేసిన ఆ మాజీ సీఎం దగ్గర మాట్లాడగలరా? వేల కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర వాళ్లది. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు పదేండ్లు పాపాలు చేసి ఇప్పుడేదో మాట్లాడుతున్నారు’’ అని నిప్పులుచెరిగారు.

ఆగ్రహంతో ఊగిపోయిన కౌశిక్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డి చేసిన ‘ఖబడ్దార్’ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్పారు. ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని కేటీఆర్, జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తనను అన్నారు కాబట్టే దానికి వివరణ ఇచ్చానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో రికార్డులను పరిశీలించాక ఆ పదాన్ని తొలగిస్తామని స్పీకర్ చెప్పారు. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే పదే ఆటంకం కలిగించారు. పోచారం శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడుతూ.. సభా మర్యాదను కాపాడాలని కోరారు. కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారని,  సభా హుందాతనాన్ని కాపాడాలని హితవు చెప్పారు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ఊహించలేమని, ప్రజా తీర్పుతో తాము ప్రతిపక్షంలో కూర్చున్నామని వ్యాఖ్యానించారు. తప్పు చేయకున్నా ఒక్కోసారి శిక్ష తప్పదన్నారు. వ్యక్తిగత దూషణలకు పోవద్దని హితవు చెప్పారు. తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడే ప్రయత్నం చేయగా.. పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేకలు వేశారు. దీంతో ఇటు మంత్రులు, కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు కూడా లేచి పోటీగా నిరసన తెలిపారు. మాటామాటా పెరగడంతో సహనం కోల్పోయిన పాడి కౌశిక్​ రెడ్డి మంత్రులవైపు వేలు చూపిస్తూ బెదిరింపులకు దిగారు. ఆయన మరింత ఆవేశంతో ఊగిపోతుండడంతో కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి,ఇతర ఎమ్మెల్యేలు వచ్చి సర్దిచెప్పి కూర్చోబెట్టారు. ఈ సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని.. ప్రతిపక్షాల అభిప్రాయాలు వినేందుకు వారికి మంచి సమయం ఇచ్చామని, కానీ అదంతా వదిలేసి వ్యక్తిగత దాడులకు దిగేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. సభా మర్యాదలు నేర్చుకోవాలంటూ కౌశిక్ రెడ్డికి స్పీకర్ సూచించారు. ఇదే విషయం కాంగ్రెస్ వాళ్లకూ చెప్పాలంటూ స్పీకర్​ను కేటీఆర్ కోరారు.

ఖబడ్దార్ అని ఎవరిని అన్నరు?: జగదీశ్ రెడ్డి

జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా సభ్యుడిని మేం మందలించాం. కానీ ఆయన ఖబడ్దార్ అని ఎవరిని అన్నారు? అధ్యక్ష స్థానాన్నా? మమ్మల్నా? లేదంటే నన్నా? ఇదేనా సభా మర్యాద? నేను వ్యక్తిగత దూషణ చేశానా? రికార్డులను చూడండి. నేను వ్యక్తిగత దూషణలకు పాల్పడి ఉంటే ఎలాంటి చర్యలకైనా సిద్ధం. వ్యక్తిగతంగా నేనుగానీ.. వాళ్లుగానీ ఏదైనా అని ఉంటే రికార్డుల నుంచి తొలగించండి. దాంతో పాటు ఖబడ్దార్ అంటూ మాట్లాడిన వాళ్లపై ఏం చర్యలు తీసుకుంటారు?’’ అని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాలన్న జగదీశ్ రెడ్డికి రాజగోపాల్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్లు తనను రెచ్చగొట్టడం వల్లే తాను ఖబడ్దార్ అని అనాల్సి వచ్చిందన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు.. సభా మర్యాదను మరిచి ఉరికిచ్చి కొడతామని అనలేదా అని ప్రశ్నించారు. అప్పుడేమైంది వాళ్ల తెలివి అంటూ మండిపడ్డారు. తనను అంటే కచ్చితంగా ఖబడ్దార్ అంటానని తేల్చిచెప్పారు. ‘తొందరపడకండి.. ఓపికతో ఉండండి’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఉద్దేశించి అన్నారు.