సీడీసీ రిపోర్ట్: డెల్టా వేరియంట్‌పై డేంజ‌ర్ బెల్స్

సీడీసీ రిపోర్ట్: డెల్టా వేరియంట్‌పై డేంజ‌ర్ బెల్స్

వాషింగ్ట‌న్: క‌రోనా వైర‌స్ డెల్టా వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోంద‌ని, ఈ మ‌హ‌మ్మారిపై పోరు తీరు మారాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అమెరికా హెచ్చ‌రిస్తోంది. డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, ఇత‌ర చ‌ర్య‌ల‌పై అమెరికాలోని సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ఒక నివేదిక రూపొందించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఫుల్ వ్యాక్సినేష‌న్ అయిన వారికి మాస్క్ అవ‌స‌రం లేద‌ని చెప్పిన సీడీసీ తాజాగా స్ట్రాట‌జీ మార్చ‌కత‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేసింది. వ్యాక్సినేష‌న్ పూర్త‌యినా స‌రే మాస్క్ పెట్టుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే వాలంట‌రీ వ్యాక్సినేష‌న్ విధానం కాకుండా హెల్త్ వ‌ర్క‌ర్స్ అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని త‌న ఇంట‌ర్న‌ల్ రిపోర్ట్‌లో పేర్కొంది.  

రిపోర్ట్‌లోని సీరియ‌స్‌ పాయింట్స్

  • తొలుత ఇండియాలోనే గుర్తించిన ఈ డెల్టా వేరియంట్.. మామూలు జ‌లుబు క‌న్నా వేగంగా వ్యాపిస్తోంద‌ని సీడీసీ పేర్కొంది. చికెన్‌పాక్స్ లాగా ఈజీగా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి అంటుకుంటోంద‌ని తెలిపింది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా డెల్టా క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయ‌ని చెప్పింది.
  • గ‌తంలో ఉన్న వైర‌స్ స్ట్రెయిన్‌ల కన్నా డెల్టా చాలా సీరియ‌స్ డిసీజ్‌గా మారే ప్ర‌మాదం ఉంద‌ని సీడీసీ హెచ్చ‌రించింది.
  • ఇంప్రూవింగ్ క‌మ్యూనికేష‌న్స్ అరౌండ్ వ్యాక్సిన్ బ్రేక్‌థ్రూ అండ్ వ్యాక్సిన్ ఎఫెక్టివ్‌నెస్ (Improving communications around vaccine breakthrough and vaccine effectiveness) అనే పేరుతో సీడీసీ రిపోర్టును రూపొందించింది. క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్న వారి నుంచి కూడా డెల్టా వేరియంట్ ఇత‌రుల‌కు అంటుకునే ముప్పు ఉందని అందులో తెలిపింది. 
  • వ్యాక్సిన్ వేయించుకున్న వారితో పోలిస్తే అస‌లు టీకా తీసుకోని వాళ్ల‌లో డెల్టా వేరియంట్ వ‌ల్ల వ్యాధి తీవ్ర‌త, మ‌ర‌ణించే ముప్పు 10 రెట్లు ఎక్కువ‌ని సీడీసీ హెచ్చ‌రించింది. దీనిని బ‌ట్టి ప్ర‌జ‌ల‌కు సీరియ‌స్‌నెస్ అర్థ‌మ‌య్యేలా క‌రోనాపై పోరులో మార్పులు చేయాల‌ని ప్ర‌భుత్వాల‌కు సూచించింది. ప్ర‌తి ఒక్క‌రికీ క‌రోనా రిస్క్‌ను తెలియ‌జేసి వేగంగా వ్యాక్సినేష‌న్ జ‌రిగేలా చూడాల‌ని చెప్పింది.
  • వ్యాక్సిన్ వేసుకున్న వారికి క‌రోనా వైర‌స్ సోకే రిస్క్ త‌క్కువ అని సీడీసీ తెలిపింది. ఒక వేళ డెల్టా వేరియంట్ సోకినా (బ్రేక్‌థ్రూ ఇన్‌ఫెక్ష‌న్) సీరియ‌స్ అయ్యే చాన్స్ త‌క్కువేన‌ని, అయితే వ్యాక్సిన్ వేసుకున్న పేషెంట్ల నుంచి తెలియ‌కుండానే ఇత‌రుల‌కు అంటుకునే ముప్పు ఎక్కువ‌ని హెచ్చ‌రించింది. అందుకే వ్యాక్సినేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని నిబంధ‌న పెట్టడంతో పాటు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు కూడా మాస్క్ పెట్టుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది.
  • ప‌లు ఆసియా దేశాల‌తో పాటు అమెరికా, యూకే. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంద‌ని సీడీసీ రిపోర్ట్‌లో పేర్కొంది.