
- అన్ని దేశాలను సమానంగా చూస్తే యుద్ధాలుండవని కామెంట్
- బీజింగ్‌లో ఘనంగా విక్టరీ పరేడ్
- అత్యాధునిక ఆయుధాలు.. ప్రపంచాన్నంతా కవర్ చేసే అణ్వస్త్ర క్షిపణి ప్రదర్శన
- పరేడ్‌కు పుతిన్, కిమ్ సహా 26 దేశాల నేతల హాజరు
బీజింగ్: ప్రపంచ మానవాళి ఎదుట నేడు.. యుద్ధమా? లేదంటే శాంతా? చర్చలా లేదంటే పోరాటమా? పరస్పర లాభదాయక ఫలితాలా? లేదంటే ఎలాంటి ప్రయోజనం లేని ఆటలా? అన్న పరిస్థితులు నెలకొన్నాయని చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశమూ, ఇతర దేశాలను తనతో సమానంగా చూసినప్పుడు మాత్రమే యుద్ధాలు ఆగిపోతాయని ఆయన హితవు పలికారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల పేరిట అనేక దేశాలను బెదిరిస్తున్న నేపథ్యంలో ఆయనకు జిన్ పింగ్ ఈ మేరకు పరోక్షంగా హెచ్చరికలు చేశారు. ‘‘ప్రతి దేశమూ ఇతర దేశాలతో సామరస్యంతో మెలిగినప్పుడు, పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకున్నప్పుడు మాత్రమే యుద్ధాలు జరగవు. తద్వారా చరిత్రాత్మకమైన విషాదాలను నివారించవచ్చు” అని చెప్పారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో జపాన్ పై చైనా సాధించిన విజయానికి 80 ఏండ్లు అయిన సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 03) బీజింగ్ లో 80వ విక్టరీ పరేడ్ ను ఘనంగా నిర్వహించారు.
గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వేలాది బలగాలతో కవాతు, అత్యాధునిక ఆయుధాలను ఈ పరేడ్ లో ప్రదర్శించి, చైనా ప్రపంచానికి తన మిలిటరీ సత్తాను చాటింది. మరోవైపు జిన్ పింగ్ తో కలిసి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తొలిసారి ఒకే వేదికపైకి రావడం ద్వారా అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
చైనా ఎవరికీ భయపడదు..
విక్టరీ డే పరేడ్ సందర్భంగా బీజింగ్ లోని తియాన్మెన్ గేట్ వద్ద జిన్ పింగ్ మాట్లాడుతూ.. ‘‘చైనా పునరుజ్జీవాన్ని ఎవరూ ఆపలేరు. చైనా ఎవరికీ భయపడబోదు. ఎన్నడూ ఎవరి బెదిరింపులకూ లొంగదు. ఎల్లప్పుడూ ముందుకే వెళ్తుంది. మానవాళి ఎదిగితే కలిసి ఎదుగుతుంది. లేదంటే కలిసి నాశనమవుతుందని మనల్ని చరిత్ర హెచ్చరిస్తోంది” అని ట్రంప్ ను ఉద్దేశించి జిన్ పింగ్ కామెంట్ చేశారు. విక్టరీ పరేడ్ లో మిలిటరీ సత్తా చాటడం ద్వారా.. ‘బలాన్ని తెలియజేయడం ద్వారానే శాంతిని సాధించగలం’ అన్న సందేశాన్ని ప్రపంచానికి ఆయన ఇచ్చినట్టుగా అయింది.
చైనా పునరుజ్జీవానికి ఆ దేశ సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) వ్యూహాత్మక మద్దతు ఇవ్వాలని, అలాగే ప్రపంచ శాంతి, అభివృద్ధికీ తోడ్పాటును అందించాలని పీఎల్ఏ హైకమాండ్ ‘సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ)’కు అధిపతిగా కూడా ఉన్న జిన్ పింగ్ ఆదేశించారు. చైనీస్ మిలిటరీ ప్రపంచ స్థాయి శక్తిగా ఎదగాలని, దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడాలని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై చైనా విజయం అనేది.. ఆధునిక కాలంలో విదేశీ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనాకు దక్కిన తొలి పూర్తి స్థాయి విజయమని జిన్ పింగ్ అన్నారు. ఆ యుద్ధంలో చైనాకు మద్దతు ఇచ్చిన దేశాలను చైనా ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని చెప్పారు.
పుతిన్, కిమ్ సహా 26 దేశాల నేతలు హాజరు..
చైనా విక్టరీ పరేడ్ కు పుతిన్, కిమ్ తోపాటు 26 దేశాల అధినేతలు హాజరయ్యారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్, సౌత్ ఈస్ట్ ఏసియా దేశాల నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ తరఫున చైనాలోని ఇండియన్ అంబాసిడర్ ప్రదీప్ కుమార్ రావత్ పరేడ్ కు హాజరయ్యారు. జపాన్ తోపాటు అమెరికా, యూరోపియన్ యూనియన్, సౌత్ కొరియా దేశాలు మాత్రం ఈ పరేడ్ కు దూరంగా ఉన్నాయి. అయితే, ఈ పరేడ్ కు హాజరుకావద్దంటూ ప్రపంచ దేశాలను జపాన్ కోరడంపై చైనా మండిపడింది. ఈ విషయంలో జపాన్ కు దౌత్యపరమైన నిరసన తెలిపింది.
మిలిటరీ పవర్ చాటిన డ్రాగన్..
విక్టరీ పరేడ్ లో చైనా తొలిసారిగా భారీ ఎత్తున మిలిటరీ పవర్‌ను చాటింది. శత్రు ఆయుధాల ఆప్టికల్ సెన్సర్లను ధ్వంసం చేయగల కొత్త ఎల్ వై1 లేజర్ వెపన్ ను ప్రదర్శించింది. అలాగే తొలిసారిగా డీఎఫ్ 5సీ ఖండాంతర అణ్వస్త్ర క్షిపణులను, జేఎల్1 ఎయిర్ లాంచ్డ్ న్యూక్లియర్ మిసైల్‌ను, జేఎల్3 సబ్ మెరైన్ వెర్షన్ బాలిస్టిక్ మిసైల్‌ను కూడా ప్రదర్శించి సత్తా చాటింది. పలు ఫైటర్ జెట్లను, రోబో తోడేళ్లను, జీజే11 స్టెల్త్ డ్రోన్‌ను, ఏజేఎక్స్002 మెరైన్ డ్రోన్‌నూ ప్రదర్శించడం ద్వారా మిలిటరీ పవర్లో అమెరికాకు దీటుగా బలం ఉన్నట్టుగా ప్రపంచానికి తెలియజేసింది.
భూగోళమంతా దీని రేంజ్‌లోనే..!
చైనా విక్టరీ పరేడ్ లో ప్రదర్శించిన అత్యాధునిక న్యూక్లియర్ మిసైల్ ‘డీఎఫ్– 5సీ’. సంప్రదాయ, అణు వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం, 20 వేల కిలోమీటర్లకు పైగా దూరంలోని టార్గెట్ ను గురితప్పకుండా వెళ్లి తాకడం దీని ప్రత్యేకతలు. అంటే.. ఈ ఖండాంతర క్షిపణి భూగోళంలో ఏ మూలన ఉన్న దేశన్నైనా వెళ్లి తాకుతుంది.
ఈ క్షిపణిని మూడు భాగాలుగా విడదీసి ట్రక్కుల్లో తరలించవచ్చు. విడి భాగాలను కలిపి లాంచింగ్‌కు రెడీ చేయడమూ సులువే. ఇది శబ్ద వేగానికన్నా 10 నుంచి 25 రెట్లు అధిక వేగంతో దూసుకెళుతుంది. దీంతో చైనాపై అణుదాడికి నిమిషాల్లోనే బదులివ్వొచ్చు. ఒకటి కంటే ఎక్కువగా వార్ హెడ్లను మోసుకెళ్లే శక్తితో పాటు సరిహద్దుల్లోని రక్షణ వ్యవస్థను బోల్తా కొట్టించేలా నిర్మాణం. దేశీయ నావిగేషన్ వ్యవస్థతో దూసుకెళ్లే ఈ మిసైల్ టార్గెట్ ను గురి తప్పకుండా పేల్చేస్తుంది.