నల్గొండ, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటు చేసి.. కాంగ్రెస్ బిగ్షాట్స్ నంబర్లు, బీఆర్ఎస్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మునుగోడు బై ఎలక్షన్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సహకరించిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రముఖ ఫైనాన్స్ సంస్థలు, రియల్టర్లు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలిసింది.
ప్రభాకర్‌రావు టీమ్‌లో సైబర్ క్రైమ్స్, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగిన పలువురు ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో ప్రత్యేకంగా ఓ టీమ్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇప్పుడా వ్యవహారం బయటపడటంతో అప్పుడు పనిచేసిన ఇద్దరు కానిస్టేబుళ్లను దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్నది. కొద్దిరోజుల ముందే దేవరకొండ ప్రాంతంలో సీఐ హోదా అధికారికి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు అందినట్టు తెలిసింది.
దీంతో ఆయన ఇప్పటికే రెండుసార్లు దర్యాప్తు సంస్థ ఎదుట విచారణకు హాజరైనట్టు సమాచారం. ఆయనతోపాటు మరో ఇద్దరు సీఐల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇద్దరు డీఎస్పీ స్థాయి ప్రత్యేక అధికారులు మేళ్లచెర్వులో మకాం వేసి, ఓ సిమెంట్ ఫ్యాక్టరీకి సహకరించేందుకు.. ఆ కంపెనీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ల ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్టు సమాచారం.