ముంపు తప్పదా..? మొదలవని వరంగల్​ బొందివాగు డెవలప్​మెంట్ ​పనులు

ముంపు తప్పదా..? మొదలవని వరంగల్​ బొందివాగు డెవలప్​మెంట్ ​పనులు
  • అభివృద్ధి కోసం రూ.158 కోట్లతో ప్రపోజల్స్​
  • వర్షాలు పడితే చాలు వరదలోనే కాలనీలు
  • హనుమకొండలో జెట్ స్పీడ్ తో నయీంనగర్ నాలా పనులు

హనుమకొండ, వెలుగు: 2020 లో కురిసిన అతి భారీ వర్షాలకు మునిగిపోయిన వరంగల్​సిటీ దుస్థితి ఇంకా కండ్ల ముందు కదలాడుతూనే ఉంది. రాష్ర్టంలో సర్కారు మారిన తర్వాత ముంపు ప్రాంతాల అభివృద్ధి పనులు ప్రారంభం కాగా, గ్రేటర్ వరంగల్ లో వరద, ముంపు నివారణ పనుల పరిస్థితి ఒక్కోచోట ఒక్కో రకంగా కనిపిస్తోంది. హనుమకొండలో చేపట్టిన నయీంనగర్ నాలా పనులు జెట్ స్పీడ్ తో సాగుతుండగా, వరంగల్ లోతట్టు కాలనీలను ముంచెత్తే బొందివాగు నాలా పనులకు మాత్రం మోక్షం కలగడం లేదు. రూ.158 కోట్లతో బొందివాగు నాలా డెవలప్ మెంట్ కు గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ప్రభుత్వ పెద్దలు శంకుస్థాపన కూడా చేశారు. కానీ, ఇంతవరకూ పనులు ప్రారంభంకాకపోవడంతో ఈ వర్షాకాలం కూడా బొందివాగు నాలా చుట్టూ ఉన్న కాలనీలకు ముంపు తప్పదా అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జెట్ స్పీడ్ తో నయీంనగర్ నాలా పనులు..

వరంగల్ నగర పరిధిలో వరద నీరు పారేందుకు ప్రధానంగా హనుమకొండ ప్రాంతంలో నయీంనగర్​, వరంగల్ లో బొందివాగు, భద్రకాళీ నాలాలు ఉన్నాయి. 2020లో కురిసిన అతి భారీ వర్షాలకు వరంగల్ ట్రైసిటీలోని నాలాలు, డ్రైన్లు ఉప్పొంగి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. చెరువుల గొలుసుకట్టు తెగిపోవడంతోపాటు నాలా ఆక్రమణల వల్లే వరంగల్ నీట మునిగిందని తేల్చిన గత ప్రభుత్వం వరద నివారణ చర్యలను లైట్ తీసుకుంది. దీంతో ఏటా వర్షాకాలంలో ట్రై సిటీలోని వందలాది కాలనీలు నీటమునుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో సర్కారు మారిన తర్వాత హనుమకొండ నయీంనగర్ నాలాపై పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫోకస్ పెట్టి ఇరిగేషన్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు. దాదాపు రూ.90 కోట్లతో పనులు స్పీడప్​ చేయించారు. జూన్ 15 డెడ్ లైన్ పెట్టుకుని పనుల్లో వేగం పెంచారు. 

ముందుకు కదలని పనులు..

బొందివాగు నాలాను భద్రకాళీ చెరువు వరకు 20 మీటర్ల మేర విస్తరించేందుకు గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదట దాదాపు రూ.142 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా,  తర్వాత వివిధ పనుల మార్పుతో రూ.158 కోట్లతో ఫైనల్ ప్రపోజల్స్ పంపించారు. కానీ, గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  ఆ పనులకు ఆమోదం లభించగా, మార్చిలో మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క శంకుస్థాపన చేశారు. ఆ తరువాత ఎలక్షన్ కోడ్ రావడంతో పనులకు ఆటంకాలు ఏర్పడగా, అత్యవసర పనులుగా భావించి ఎలక్షన్ కమిషన్ అప్రూవల్​ ఇచ్చినప్పటికీ ఆ పనులు ఇంతవరకూ ప్రారంభించలేదు. దీంతో ఈ వర్షాకాలంలో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

'బొందివాగు'తో ముంపు ముప్పు..


ఓ వైపు నయీంనగర్ పనులు వేగంగా సాగుతుండగా, వరంగల్ లో ముంపునకు కారణమయ్యే బొందివాగు నాలా పనులు మాత్రం ఇంతవరకూ పట్టాలెక్కలేదు. వరంగల్ ప్రాంతంలో తిమ్మాపూర్, కొండపర్తి, అమ్మవారిపేట, భట్టుపల్లి, రంగశాయిపేట బెస్తం చెరువు, తదితర చెరువుల నుంచి వచ్చే వరద బొందివాగు నాలా గుండానే వెళ్తుంది. కాగా, ఉర్సు రంగసముద్రం నుంచి దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ నాలా రెండు వైపులా ఆక్రమణలతో కుచించుకుపోయింది. ఉర్సు చెరువు నుంచి వరంగల్ రైల్వే ట్రాక్​ వరకు అష్టవంకరలు తిరగగా, నాలాను ఆనుకుని కొంతమంది వెంచర్లు ఏర్పాటు చేశారు. దీంతో చిన్నపాటి వాన పడినా బొందివాగు నాలా నిండిపోయి, చుట్టుపక్కల ఉన్న ఎన్​టీఆర్​ నగర్, సాయినగర్, బృందావన కాలనీ, సంతోషిమాత కాలనీ, బీఆర్​నగర్ తదితర ప్రాంతాలన్నీ నీటమునుగుతున్నాయి.