భయం భయం..!వరంగల్ సిటీలో వందల సంఖ్యలో ఓల్డ్ బిల్డింగ్స్​

భయం భయం..!వరంగల్ సిటీలో వందల సంఖ్యలో ఓల్డ్ బిల్డింగ్స్​
  •     శిథిల భవనాలకే మెరుగులు దిద్ది లీజుకిస్తున్న యజమానులు
  •     చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న గ్రేటర్ అధికారులు
  •     వర్షాకాలంలో కూలడంతో గాలిలో కలుస్తున్న ప్రాణాలు

హనుమకొండ, వెలుగు : ఏటా వర్షాకాలం వచ్చిందంటే వరంగల్ నగరంలోని శిథిల భవనాలు జనాలను భయంతో వణికిస్తున్నాయి. ట్రై సిటీలో వందేండ్లు దాటిన బిల్డింగ్స్ వందల సంఖ్యలో ఉండగా, వాటి ఓనర్లు పైపై మెరుగులు దిద్ది వివిధ షాపులకు లీజ్ కు ఇస్తున్నారు. దీంతో వానాకాలంలో బిల్డింగులు కూలి అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ప్రతి సంవత్సరం నగరంలో ఓల్డ్ బిల్డింగులను గుర్తిస్తున్న గ్రేటర్ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ఫలితంగా నగరంలోని ఓల్డ్ బిల్డింగ్స్ కాస్త ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.

వందేండ్లు దాటినవి వందల్లోనే..

వరంగల్ ట్రై సిటీ పరిధిలో మొత్తంగా 2.5 లక్షల ఇండ్లు ఉండగా, అందులో వందేండ్ల కిందట కట్టిన బిల్డింగ్స్ వందల సంఖ్యలోనే ఉండగా, ఎక్కువ శాతం షాపింగ్ కాంప్లెక్స్ లు, కమర్షియల్ షెట్టర్స్ నడిపిస్తున్నవే అధికం. నాలుగేండ్ల కిందట ఒకట్రెండు చోట్ల పాత బంగ్లాలు కూలిన ఘటనలు చోటుచేసుకోవడంతో అప్పటి మేయర్ గుండా ప్రకాశ్ ఆదేశాలతో జీడబ్ల్యూఎంసీ టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సిటీ వ్యాప్తంగా దాదాపు 908 బంగ్లాలు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించారు.

పలుమార్లు నోటీసులు ఇచ్చినా కూల్చకోకపోవడంతో వరంగల్ చౌరస్తాలో ప్రమాదకరంగా ఉన్న ఓ బిల్డింగ్ ను గ్రేటర్ అధికారులే స్వయంగా కూల్చేశారు. ఆ తర్వాత సిటీలో శిథిల భవనాల యజమానులకు నోటీసులు కూడా అందజేశారు. కొందరు స్వయంగా కూల్చేసుకోగా, మరికొన్నింటిని అధికారులే నేలమట్టం చేశారు. ఇదిలాఉంటే కూల్చివేతల సమయంలో గ్రేటర్ అధికారులు పైరవీలు ఉన్న బిల్డింగుల జోలికి వెళ్లలేదనే ఆరోపణలు వినిపించాయి. దీంతోనే నిరుడు తనిఖీలు చేపట్టిన ఆఫీసర్లకు 291 శిథిల భవనాలు లెక్కల్లోకి వచ్చాయి.

శిథిలమైనా మెరుగులతో సరి..

వరంగల్ బీట్ బజార్ ఏరియాతోపాటు మండి బజార్, బట్టల బజార్, వరంగల్ చౌరస్తా, హనుమకొండ చౌరస్తా ప్రాంతాల్లో శిథిల భవనాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ, మెయిన్ సెంటర్ లో ఉండి, కమర్షియల్​ కాంప్లెక్సులుగా వినియోగిస్తున్న బిల్డింగులను కూల్చుకోలేక కొందరు యజమానులు పాత బంగ్లాలకే మెరుగులు దిద్దుతున్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న వాటికి కూడా వివిధ కంపెనీల హోర్డింగులు, ఫ్లెక్సీలతో మేకప్ వేస్తున్నారు. దీంతో అవి బయటకు కొత్త వాటిలాగే కనిపిస్తున్నా, లోపల మాత్రం గోడలు నెర్రలు బారే ఉంటున్నాయి.  

లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు..

వర్షాకాలంలో ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో గ్రేటర్ ఇంజినీరింగ్, టౌన్​ ప్లానింగ్ అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. పాత బంగ్లాలను గుర్తించి, పరిస్థితిని బట్టి కూల్చడమో లేదా రిపేర్లు చేయించుకోవాల్సిందిగా నోటీసులు ఇవ్వడమో చేయాల్సి ఉంటుంది. ఏటా తనిఖీలు చేపడుతున్న అధికారులు పైరవీలు, ఆమ్యామ్యాలకు లోబడే నడుచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. రెండేండ్ల కిందట మున్సిపల్ అధికారులు శిథిల భవనాలు గుర్తించి వాటికి నోటీసులు కూడా అందజేశారు. కానీ కూలే దశలో ఉన్న కొన్ని బిల్డింగ్​లను మాత్రం ఎలాంటి చర్యలు లేకుండానే వదిలేశారు.

ఫలితంగా 2022 జూన్ 11న వరంగల్ చార్ బౌళి ఏరియాలోని ఓ పాత బంగ్లా కూలి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. అదే ఏడాది జులై 23న మండిబజార్ లో బిల్డింగ్ కూలి ఇద్దరు, ఆగస్టు 13న కూడా అదే ఏరియాలో ఓ ఇల్లు కూలి ఒకరు మృత్యువాత పడ్డారు. మరికొద్దిరోజుల్లోనే వర్షాలు విస్తారంగా కురిసే ఛాన్స్ ఉండటంతో ఓల్డ్​ బిల్డింగ్స్ తో ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికైనా గ్రేటర్ అధికారులు మేల్కొని శిథిల భవనాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై జీడబ్ల్యూఎంసీ సిటీ ప్లానర్ బానోత్​ వెంకన్నను వివరణ కోరేందుకు ఫోన్ లో సంప్రదించగా స్పందించకపోవడం గమనార్హం.