
వరంగల్సిటీ, వెలుగు: ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకాడేతో కలసి ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటులో భూముల అందజేసిన రైతులకు నష్టపరిహారం చెల్లింపు పురోగతి, దామెర చెరువు సుందరీకరణ, పైడిపల్లి లో స్పోర్ట్ సిటీ ఏర్పాటు, నర్సంపేట ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ సెంటర్ అభివృద్ధి తదితర అంశాలపై సమీక్షించారు.
వరంగల్లోని నాయుడు పెట్రోల్ పంప్ నుంచి ఏనుమాముల మార్కెట్ వరకు వయా తిమ్మాపూర్ 13 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి రైతులు అందించిన భూములకు పెండింగ్ పరిహారాన్ని ఖిలా వరంగల్, ఉర్స్, ఏనుమాముల ప్రాంత రైతులకు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. కుడా ఆధ్వర్యంలో దామెర చెరువును సుందరీకరణ, అభివృద్ధి చేయనున్న దృష్ట్యా చెరువును ఇరిగేషన్ శాఖ నుంచి కుడాకు బదలాయింపు చర్యలు తీసుకోవాలన్నారు. పైడిపల్లిలో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నర్సంపేట ప్రభుత్వాస్పత్రిలో నిర్వహిస్తున్న డయాలసిస్ సెంటర్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఇరిగేషన్ అధికారి శంకర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.