179 మంది చిన్నారులకు విముక్తి.. బాలలతో పని చేయించిన51 మందిపై కేసులు నమోదు : సీపీ సన్ ప్రీత్ సింగ్

179 మంది చిన్నారులకు విముక్తి.. బాలలతో పని చేయించిన51 మందిపై కేసులు నమోదు :  సీపీ సన్ ప్రీత్ సింగ్
  • వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ లో ఆపరేషన్ స్మైల్-12 కార్యక్రమంలో భాగంగా వివిధ పని ప్రదేశాల్లోని 179 మంది చిన్నారులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. బాలలతో పని చేయించిన 51 మంది యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జనవరి 1 నుంచి 31 వరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఆధ్వర్యంలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ లైన్, కార్మిక శాఖ ఆఫీసర్లు, స్వచ్ఛంద సంస్థల సిబ్బందితో తొమ్మిది ప్రత్యేక బృందాలు వివిధ పారిశ్రామిక ప్రాంతాలు, షాపులు, ఇటుక బట్టీలు, ఇతర పని ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టాయన్నారు.

ఇందులో 150 మంది బాలురు, 29 బాలికలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించామన్నారు. వీరిలో బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ గడ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన 87 మంది చిన్నారులు ఉన్నారన్నారు. చిన్నారుల హక్కులను కాపాడటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ కోరారు. ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆపరేషన్ స్మైల్-12 ను సక్సెస్ చేయడంలో ప్రతిభ చూపిన వరంగల్ అడిషనల్ డీసీపీ ఎన్.రవి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం సీఐ జె.శ్యామ్ సుందర్, ఇతర ఆఫీసర్లను సీపీ అభినందించారు.