ప్రాణాలు తీసిన ఎన్నికల డ్యూటీలు!

ప్రాణాలు తీసిన ఎన్నికల డ్యూటీలు!
  • కరోనా టైంలో వద్దన్నావరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు 
  • వైరస్ బారిన వందలాది మంది టీచర్లు, ఉద్యోగులు
  • దవాఖానల్లో వందలాది ప్రభుత్వ ఉద్యోగులు
  • 20 రోజుల్లోనే పదుల సంఖ్యల్లో మరణాలు
  • కష్టకాలంలో బాధితులను పట్టించుకోని రాష్ట్ర సర్కార్ 

వరంగల్‍ ఆరెళ్లి బుచ్చయ్య హై స్కూల్​లో రాధాకృష్ణ టీచర్​గా చేస్తున్నారు. గ్రేటర్‍ వరంగల్‍ ఎలక్షన్‍ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే ఫ్రెండ్స్ తో కలిసి ఎన్నికల డ్యూటీలు రద్దు చేయాలని ప్రయత్నం చేశారు. కరోనా సెకండ్‍ వేవ్‍ టైంలో గుంపులు గుంపులుగా తిరిగితే ప్రాణాలకు ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. తీరా.. ఎలక్షన్‍ డ్యూటీ తప్పలేదు. ఆపై పోలింగ్‍ డ్యూటీ కూడా చేశారు. ఇవి పూర్తయ్యాక రెండు రోజులకు ఆయనకు దగ్గు, జలుబు మొదలైంది. ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే భార్య, ఇద్దరు కూతుళ్లు టెస్టులు చేయించుకోగా వారందరికి పాజిటివ్ అని తేలింది. రాధాకృష్ణకు లంగ్స్ ఎఫెక్ట్  కావడంతో మొదట వరంగల్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు, ఆ తర్వాత హైదరాబాద్‍లోని మరో కార్పొరేట్‍ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. రాధాకృష్ణ చనిపోయారు. ఇంట్లో ఉన్న ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్‍ కావడంతో.. భవిష్యత్‍ ఏంటో అర్థమవక రోజూ ఏడుస్తున్నారు.

వరంగల్‍ రూరల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ కార్పొరేషన్‍ ఎన్నికల డ్యూటీలు పలువురు ఉద్యోగులు, టీచర్లను బలిగొంటున్నాయి. కరోనా టైంలో ఎన్నికలు వద్దని ప్రతిపక్షాలు, ప్రజా, ఉద్యోగ సంఘాలు ఎంత మొత్తుకున్నా సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా గడిచిన 20 రోజుల్లో ఒక్క వరంగల్​ సిటీలోనే 10 మంది టీచర్లు కొవిడ్​తో కన్నుమూశారు. మరో 50 మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్‍ హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీ ట్రీట్‍మెంట్‍ పొందుతున్నారు. వందలాది టీచర్ల కుటుంబాలు హోమ్‍క్వారంటైన్​లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. మరికొన్నిచోట్ల డ్యూటీలకు వెళ్లొచ్చిన టీచర్ల కారణంగా ఇంట్లోని  పెద్దలు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాల్లో వేలాది కరోనా కేసులు పెరిగాయి. కేవలం టీచర్లే కాకుండా డ్యూటీల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులను లెక్కిస్తే.. 50 కంటే ఎక్కువ మరణాలు.. వందల్లో ఎమర్జెన్సీ కేసులున్నాయి.

వద్దని మొత్తుకున్నా ఎలక్షన్‍ పెట్టిన్రు 
కరోనా సెకండ్‍ వేవ్‍ రాష్ట్రంలో జనాలను వణికించే టైంలో ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ ఎన్నికల షెడ్యూల్​ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సరికాదని టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మొత్తుకున్నారు. డ్యూటీలు చేయలేమని రిక్వెస్ట్ చేశారు. అయినా వినకుండా ఏప్రిల్ 30న ఎన్నికలు పెట్టారు. మే 2న కౌటింగ్ చేపట్టారు. ఎన్నికల డ్యూటీలో 6 వేల మంది వరకు సిబ్బంది పాల్గొన్నారు. తీరా.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు వచ్చే సమయానికి ముందే కమిషనర్ సత్పత్తి పమేలాతో పాటు కొత్తగా ఎన్నికైనా 8 మంది కార్పొరేటర్లకు కొవిడ్‍ నిర్ధారణ అయింది. పోలింగ్‍ డ్యూటీలు చేసినవారిలో ఇప్పటికే 10 మంది చనిపోగా.. 296 మంది మృత్యువుతో పోరాటం చేస్తున్నారని టీచర్‍ యూనియన్లు చెబుతున్నాయి.

సర్కార్‍ హెల్త్ కార్డ్స్ పనిచేయట్లే
ఓ దిక్కు ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం వద్దన్నా డ్యూటీలు వేసి టీచర్లు, ఉద్యోగుల కుటుంబాలు కరోనా బారిన పడేలా చేశాయి. కాగా, ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడాల్సిన సర్కార్‍ హెల్త్ కార్డ్స్ ను ఇప్పుడు ప్రైవేట్‍ హాస్పిటల్స్ రిజక్ట్ చేస్తున్నాయి. కేవలం లిక్విడ్‍ క్యాష్‍ ఉంటే మాత్రమే ట్రీట్‍మెంట్‍ ఇస్తామని చెప్పడంతో అప్పటికప్పుడు లక్షల రూపాయలు అడ్జస్ట్ అవ్వక ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా పేషెంట్‍గా ఇతరుల వద్దకు వెళ్లలేక.. ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డ్ పనిచేయక.. వందలాది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నయ్‍.. డ్యూటీలు చేయలేమంటే వినలేదు. కచ్చితంగా చేయాల్సిందే అంటూ అటుఇటు తిప్పారు. ఇప్పుడు ఉద్యోగులు పిట్టల్లా రాలుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఎన్నికల డ్యూటీలకు రాకుంటే చర్యలు తప్పవన్న ఆఫీసర్లు పత్తాలేకుండా పోయారు. వారి అనాలోచిత నిర్ణయాల వల్ల పదుల సంఖ్యలో తమలాంటివారు ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ టీచర్లు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితికి ఎలక్షన్‍ కమిటీ, రాష్ట్ర సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్​చేస్తున్నారు. కరోనా బారిన పడిన టీచర్లు, ఉద్యోగుల కుటుంబాలని ఆదుకోవాలని కోరుతున్నారు. 

ప్రభుత్వం, ఈసీ  బాధ్యత వహించాలె 
ఎన్నికల డ్యూటీ చేసిన పాపానికి నాతో పాటు మా ఫ్యామిలీకి కరోనా సోకింది. ఇప్పటికే ట్రీట్‍మెంట్‍ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశా. నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. నా బాధ ఏంటంటే ఇంత పెద్ద ఏజ్‍లో నా వల్ల మా నాన్నకు కొవిడ్‍ వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నా. ఆయనకు ఏమైనా అయితే.. నా జీవిత కాలం మా తండ్రి మరణానికి నేనే కారకుడినయ్యాననే ఫీలింగ్‍ నన్ను వదలదు. దీనంతటికి ప్రభుత్వం, ఈసీనే బాధ్యత వహించాలి.
– శ్రీనివాసరెడ్డి, భీమదేవరపల్లి టీచర్‍

ఒక్కో టీచర్‍ ఇంట్లో.. నలుగురైదుగురు హోంక్వారంటైన్‍ 
హన్మకొండకు చెందిన చంద్రశేఖర్, గీతాదేవి దంపతులిద్దరూ సర్కారు టీచర్లే. చంద్రశేఖర్ రూరల్ జిల్లా దామెర మండలం పులుకుర్తి స్కూల్‍ లో, ఆయన భార్య దామెర స్కూల్​లో టీచర్‍గా చేస్తున్నారు. వీరిద్దరూ వరంగల్ మున్సిపల్ ఎన్నికల డ్యూటీలో పాల్గొన్నారు. అదయ్యాక రెండురోజులకు వీరిద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. డౌట్‍ వచ్చి ఇంట్లోని ఇద్దరు పిల్లలకు టెస్టులు చేయిస్తే వారికి సైతం పాజిటివ్. ఇదే లెక్కన ఎలక్షన్‍ డ్యూటీలకు వెళ్లొచ్చిన వారందరి ఇండ్లు ఇప్పుడు హోంక్వారంటైన్‍ సెంటర్లుగా మారాయి. ఈ స్టేజీ దాటిన వందలాది మంది ఎమర్జెన్సీ ట్రీట్‍మెంట్‍ కోసం హస్పిటల్స్ లో  చేరారు. ఇంకొన్ని ఇండ్లల్లో వారి ద్వారా చిన్నపిల్లలకు సోకింది. డ్యూటీలు చేసొచ్చినవారి తల్లిదండ్రులకు సోకడంతో ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు వారి ఇంటి పెద్దోళ్లను కోల్పోయారు.  

డ్యూటీలు చేసి మరణించిన ప్రభుత్వ టీచర్లు

  • వి.రాధాకిషన్‍ (హన్మకొండ) 
  • జెట్టంగి సోమయ్య (నెక్కొండ సూరిపల్లి)
  • సీహెచ్‍.రాజారామ్మోహన్‍ ప్రసాద్‍ (జఫర్‍గఢ్‍) 
  • కొలగాని రవి (నెక్కొండ నాగారం)
  • పరీదుల ఎల్లాగౌడ్‍ (పెరికేడు)
  • పున్నంచందర్‍ (చిల్పూర్‍)
  • కె.సమ్మయ్య (నెక్కొండ)