ఓరుగల్లులో కుండపోత.. అర్ధరాత్రి దాటాక మూడున్నర గంటలు దంచికొట్టిన వాన

ఓరుగల్లులో కుండపోత.. అర్ధరాత్రి దాటాక మూడున్నర గంటలు దంచికొట్టిన వాన
  • వరంగల్  తూర్పులో నీట మునిగిన కాలనీలు
  • ఇండ్లలోకి వరద నీరు చేరడంతో బాధితుల జాగరణ
  • మెయిన్  రోడ్లపై వరద నీటిలో కొట్టుకెళ్లిన కార్లు, వాహనాలు

వరంగల్‍/హనుమకొండ, వెలుగు:గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో సోమవారం అర్ధరాత్రి దాటాక మూడున్నర గంటల పాటు వర్షం దంచికొట్టడంతో ఓరుగల్లు వణికింది. చాలా కాలనీల్లో ఇండ్లల్లోకి నడుంలోతు వరద నీరు చేరింది. రాత్రి సమయం కావడంతో ఏం చేయాలో తెలియక జనాలు తిప్పలు పడ్డారు. కరెంట్‍ లేకపోవడంతో తెల్లారే వరకు బాధితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. 24 గంటలు రద్దీగా ఉండే వరంగల్‍ సిటీ రోడ్లపై అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. 

పలుచోట్ల కార్లు, బైకులు కొట్టుకెళ్లాయి.శివనగర్‍ అండర్‍ బ్రిడ్జి ఏరియా మునగడంతో ఖమ్మం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్‍ రెల్వే స్టేషన్‍ పట్టాల మీదకు భారీగా వరద నీరు చేరింది. ప్రజాప్రతినిధులు, అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. డీఆర్‍ఎఫ్‍ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. సంగెం మండలంలో 24 సెంటిమీటర్లు, ఖిలా వరంగల్‍ మండలంలో 15, వరంగల్‍లో 13, వర్ధన్నపేటలో 12.8,  హనుమకొండ మండలంలో 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.  

నీటమునిగిన కాలనీలు

వరంగల్‍ తూర్పు ప్రాంతంలోని పలు కాలనీలు భారీ వర్షం కారణంగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలైన శివనగర్‍, సాయి గణేశ్‍ కాలనీ, ఎన్‍టీఆర్‍ నగర్‍, లెనిన్‍ నగర్‍, అగర్తల చెరువు ప్రాంతం, మైసయ్య కాలనీ, ఎస్‍ఆర్‍ నగర్‍, గిరిప్రసాద్‍ కాలనీ, వివేకానంద కాలనీ, మధురానగర్‍, పద్మానగర్‍, డీకే నగర్‍, శాకారాశికుంట కాలనీలు జలమయమయ్యాయి. హనుమకొండ సిటీ పరిధిలో గోకుల్‍ నగర్‍ ఏరియాలో పలు ఇండ్లల్లోకి వరదనీరు చేరగా.. అశోక్ కాలనీ, అంబేద్కర్‍ నగర్‍, సమ్మయ్య నగర్‍, రామ్‍నగర్‍, వికాస్‍ నగర్‍, భవానీ నగర్‍, హనుమకొండ బస్టాండ్‍, చౌరస్తా ఏరియాల్లో వరద నీరు చేరింది. నయీంనగర్‍ నాలా వెడల్పు చేసి ఇరువైపులా రిటైనింగ్‍ వాల్‍ కట్టడం, నయీంనగర్‍ బ్రిడ్జిని వెడల్పు చేయడంతో గతంతో పోలిస్తే వరద ఇబ్బందులు చాలా వరకు తగ్గాయి.  

కట్టుబట్టలు తప్పితే ఏం మిగల్లే..

అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో 20 కాలనీల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరగా.. బాధితులకు కట్టుబట్టలు తప్ప ఏం మిగలలేదు. కరెంట్‍ కూడా లేకపోవడంతో ఇంట్లోని సామాను కాపాడుకోలేకపోయారు. ఇండ్లల్లో మంచాలు, టీవీలు, కూలర్లతో పాటు బియ్యం, ఉప్పుపప్పులు, కట్టుకునే బట్టలు పనికిరాకుండా పోయాయి. బోర్ల చుట్టూ బురద పేరుకుపోవడంతో మంచి నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఆటోలు, బైకులు, సైకిళ్లు వరద నీటిలో మునిగి పనికి రాకుండా పోయాయి. 

బాధితులకు భరోసా..

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, వరంగల్‍ కలెక్టర్‍ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍ చాహత్‍ బాజ్‍పాయ్‍ ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చి పునరావసం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. డీఆర్‍ఎఫ్‍ బృందాలు తెల్లవారుజామునే కాలనీలకు చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న మిల్స్  కాలనీ, ఇంతేజార్‍గంజ్‍ పోలీస్‍ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్‍ ఏసీపీ సత్యనారాయణ, సీఐ షుకూర్‍ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. 

మిల్స్  కాలనీ ఇన్స్​పెక్టర్‍ బొల్లం రమేశ్‍ ఆధ్వర్యంలో సిబ్బంది నీట మునిగిన ఇండ్ల నుంచి చిన్నారులు, వృద్ధులను బయటకు తీసుకొచ్చారు. నాలా విస్తరణ పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్‍, బల్దియా కమిషనర్‍ తెలిపారు. మంగళవారం సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం మేరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వృద్ధురాలు మృతి..

వరంగల్‍ మిల్స్​కాలనీ పోలీస్‍ స్టేషన్‍ ఎదురుగా ఉండే పసునూరి బుచ్చమ్మ(80) వర్షం కారణంగా చనిపోయింది. బాంబే కాలనీలోని ఓ క్వార్టర్​ మొదటి అంతస్తులో ఆమె ఉంటోంది. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె సోమవారం రాత్రి వరండాలో పడుకుంది. బుచ్చమ్మ పడుకున్నచోటే వానలో తడిసి చనిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు.

పునరావాస కేంద్రాలకు తరలింపు

వరంగల్‍ లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవడంతో బాధితుల కోసం 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,300 మందికి భోజన వసతి కల్పించారు. గ్రేటర్‍ పరిధిలో సహాయక చర్యల కోసం వరంగల్‍, హనుమకొండ కలెక్టరేట్‍లతో పాటు జీడబ్ల్యూఎంసీ పరిధిలో టోల్‍ ఫ్రీ నంబర్‍ 18004251980, మొబైల్ నంబర్‍ 9701999676 అందుబాటులోకి తెచ్చారు. 2 డీఆర్‍ఎఫ్‍ బృందాలు 4 గంటలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకున్నారు.