
- చికిత్సపొందుతూ భర్త మృతి.. భార్య అరెస్ట్
- వరంగల్ జిల్లా భవానీకుంట తండాలో ఘటన
వర్ధన్నపేట, వెలుగు: కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి ఇచ్చి భర్తను భార్య చంపిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పోలీ సులు, మృతుడి తండ్రి తెలిపిన మేరకు.. వర్ధన్న పేట మున్సిపాలిటీ పరిధి భవానీ కుంట తండాకు చెందిన జాటోతు బాలాజీ(44), కాంతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలతో గొడవలు అవుతున్నాయి. ఈనెల 8న తండాలో పండుగ సందర్భంగా బయటకు వెళ్లి మద్యం తాగుతానని భార్యకు బాలాజీ చెప్పాడు. ఇంట్లోనే మద్యం ఉందని చెప్పి భార్య థమ్సప్ లో గడ్డి మందు కలిపి తీసుకొచ్చి ఇచ్చింది. అది తాగిన వెంటనే బాలాజీకి గొంతు నొప్పి మొదలైంది. భర్తను పట్టించుకోకుండానే కాంతి తన బావ వాంకుడోతు దశరు వద్దకు వెళ్లిపోయింది.
ఇరుగుపొరుగు బాలాజీ పరిస్థితిని చూసి అతడి తండ్రికి తెలపడంతో వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ్నుంచి వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. థమ్సప్ లో గడ్డి మందు కలిపి ఇవ్వడం వల్లే తన కొడుకు చనిపోయాడని మృతుడి తండ్రి హరిచందర్ వర్ధన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ గొడవలను సాకుగా చూపి బావ దశరుతో కలిసి కోడలు తన కొడుకును చంపిందని ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.