యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి .. లోక్ సభలో ఎంపీ కడియం కావ్య

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి .. లోక్ సభలో ఎంపీ కడియం కావ్య

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, పీఎంఈజీపీ, స్కిల్ ఇండియా మిషన్ వంటి జాతీయ పథకాలను తెలంగాణలో మరింత వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం లోక్ సభలో ఎంపీ కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

 తెలంగాణలో యువతకు ఉపాధి అవశాకాలు కల్పించే దిశలో.. రాష్ట్రీయ యువ సశక్తీ కరణ్ కార్యక్రమ్(ఆర్​వైఎస్​కే), నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్), ఎంవై భారత్ వంటి కార్యక్రమాలు రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నామని వివరించారు. ఎంవై భారత్ 2025–26 వార్షిక ప్రణాళికలో భాగంగా వరంగల్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’, ‘స్కిల్స్ ఫర్ సక్సెస్’, జిల్లా స్థాయి క్రీడా పోటీలు, వికసిత్ భారత్ – యువ ఉత్సవ్ వంటి ప్రోగ్రాంలు చేపడుతున్నట్టు సమాధానంలో వెల్లడించారు. 

బీఎన్ఎస్ఎస్ యాక్టులో సెక్షన్ 35(3)కు సవరణ అవసరం: ఎంపీ రఘురాం రెడ్డి

భారతీయ నాగరిక్ సురక్ష సంహిత యాక్టులో నిందితులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే.. వెంటనే అరెస్టులు చేపట్టేలా సెక్షన్ 35(3)ను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి సూచించారు. నోటీసులతో సమయం ఇవ్వడం వల్ల బాధితులను నిందితులు బెదిరించడానికి, సాక్ష్యాలను నాశనం చేయడానికి, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సెక్షన్ 35(3) లో కీలకంగా మహిళలు, పిల్లలు, ప్రజా భద్రతకు సంబంధించిన కేసులను మినహాయించాలని, నిందితులను వెంటనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి పోలీసులకు అనుమతి ఇవ్వాలని, ఫిర్యాదు వచ్చిన వెంటనే నోటీసు అం దించేలా, అరెస్టు చేసేలా అనుమతి ఇవ్వాలని ఎంపీ కోరారు.