
హనుమకొండసిటీ, వెలుగు: అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలను అందజేస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ లో కలెక్టర్ స్నేహ శబరీశ్ అధ్యక్షతన రైల్వే, మున్సిపల్, కుడా పరిధిలో వివిధ పనులపై సంబంధిత శాఖల అధికారులతో ఎంపీ, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రై సిటీలోని సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కాజీపేటలో బస్టాండ్ ఏర్పాటు అంశం ప్రస్తావించినట్లు తెలిపారు. సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ మంజూరైందని, భవనం కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ కాజీపేట బోడగుట్ట ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందన్నారు. మేయర్ సుధారాణి మాట్లాడుతూ వాటర్ సప్లయి, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.