ఫలించిన వరంగల్ రైతుల ఉద్యమం

ఫలించిన వరంగల్ రైతుల ఉద్యమం

వరంగల్ రైతుల ఆందోళనలకు ప్రభుత్వం దిగి వచ్చింది. ల్యాండ్ పూలింగ్‌‌‌లో భూములు సేకరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ జిల్లాలో 28 గ్రామాల్లో మార్చి 30వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా గ్రామాల రైతులు గత కొన్ని రోజులుగా ఆందోలనలు చేస్తున్నారు. ఐదు నెలలుగా చేస్తున్న ఆందోళనలు ఉధృతం కావడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 41 కిలోమీటర్ల వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు కోసం వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలోని 28 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు సేకరించాలని కాకతీయ అర్బల్ డెవలప్ మెంట్ (కుడా) నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.


ల్యాండ్ పూలింగ్ కు భూ యజమానుల సమ్మతి కోసం తెచ్చిన జీవో 80 ఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..గత 5 నెలలుగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. ఈ క్రమంలో రైతుల ఆందోళనలను మంత్రి కేటీఆర్ దృష్టికి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ల్యాండ్ పూలింగ్ విధానానికి స్వస్తి పలకాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సోమవారం రాత్రి మున్సిపల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం : -

కృష్ణా ఆర్ఎంసీ మీటింగ్కు తెలంగాణ గైర్హాజరు


దేశాన్ని అమెరికాకు అమ్మింది సోనియానే !!