- నిషేధిత యాప్ లు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ పై ఫోకస్
- పంటర్లు, బుకీలను గుర్తించేలా ప్లాన్
- బెట్టింగ్ ను కట్టడి చేసేందుకు చర్యలు
హనుమకొండ, వెలుగు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ కావడంతో క్షేత్రస్థాయిలో బెట్టింగ్ కూడా మొదలైంది! స్మార్ట్ ఫోన్లలో ప్లే స్టోర్, వివిధ సెర్చ్ ఇంజిన్ల నుంచి యాప్స్ ఇన్ స్టాల్ చేయడం, మ్యాచ్ ను బట్టి బెట్టింగులు కాయడం షురూ అయ్యింది. పల్లె, పట్నం తేడా లేకుండా ఈజీ మనీ కోసం అలవాటుపడుతున్న యువకులు ఈ బెట్టింగ్ బాగోతం నడిపిస్తుండగా, ఏటా రూ.కోట్లలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి.
ఇందులో మోసపోతున్న యువకులే ఎక్కువగా ఉంటుండగా, ఉన్నదంతా కోల్పోయి సూసైడ్స్ చేసుకుంటున్న వాళ్లు చాలామందే ఉన్నారు. ఐపీఎల్ స్టార్ట్ కావడం, గతంలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వరంగల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. గతంలో బెట్టింగ్ కేసుల్లో పట్టుబడిన వారిపై నిఘా పెట్టడంతో పాటు అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ పై ఫోకస్ పెడుతున్నారు.
పంటర్ల నుంచి బుకీలుగా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ దందా నడిపించే గ్యాంగులు చాలానే ఉన్నాయి. ఇందులో టైమ్ పాస్ కోసం పంటర్ గా బెట్టింగ్ మొదలు పెట్టిన యువకులు, ఆ తర్వాత బుకీలుగా మారి రూ.కోట్ల దందా నడిపిస్తున్న వారూ ఉన్నారు. హనుమకొండ గోపాలపురం వెంకటేశ్వరకాలనీకి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి దాదాపు పదేండ్ల నుంచి బెట్టింగ్ నడిపిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల బుకీగా మారాడు.
ఇప్పటివరకు అతడు ఐదుసార్లు అరెస్ట్ అయ్యాడు.. అతడితో పాటు వర్ధన్నపేట, జనగామ, స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన యువకులు కూడా ఇలాగే బుకీల అవతారమెత్తగా, ఇదివరకు పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.కోట్లలో డబ్బు సీజ్ చేశారు. ఇలా బుకీలుగా మారిన వ్యక్తులంతా బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్, ప్లేయర్లపై బెట్టింగ్ లు కాస్తుండటంతో ప్రతి ఐపీఎల్ సీజన్ లో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయి.
నష్టపోతున్న అమాయకులు..
ఈజీ మనీ కోసం యువకులు బెట్టింగులకు అలవాటుపడుతుండగా, అందులో చాలామంది అమాయకులు తీవ్రంగా నష్టపోతున్నారు. బెట్టింగుల కోసం చేసిన అప్పులు తీర్చలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గతంలో ధర్మసాగర్ మండలం మల్లక్ పెల్లికి చెందిన యువకుడు బెట్టింగుల వల్ల అప్పుల పాలై సూసైడ్ చేసుకున్నాడు. 2023లో నర్సంపేటకు చెందిన ఓ ఇంటర్ స్టూడెంట్ కూడా ఇలాగే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ ఉద్యోగి కూడా బెట్టింగులకు అలవాటుపడి చివరకు అప్పుల భారంతో సూసైడ్ చేసుకున్నాడు.
ఫోకస్ పెట్టిన పోలీసులు..
బెట్టింగుల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతుండటంతో వరంగల్ కమిషనరేట్ పోలీసులు అలర్ట్ అయ్యారు. గతేడాది ఐదు కేసుల్లో ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ.3.63 లక్షలు సీజ్ చేయగా, ఈసారి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచే బెట్టింగ్ యాప్స్ పై నిఘా పెంచారు. బెట్టింగులకు పాల్పడే వారిని గుర్తించేందుకు టాస్క్ ఫోర్స్ తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో ప్రత్యేక దృష్టిపెట్టారు.
ముఖ్యంగా అనుమానాస్పదంగా జరిగే ట్రాన్సాక్షన్స్ పై బ్యాంక్ ఆఫీసర్ల సమన్వయంతో దృష్టి పెట్టారు. బెట్టింగ్ నిర్వహించే వారితో పాటు పంటర్లను కూడా గుర్తించే పనిలో పడ్డారు. పక్కా ఆధారాలతో బుకీలు, పంటర్లను అరెస్ట్ చేసి, కటకటాల్లోకి పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈజీ ఎర్నింగ్ వైపు ఆలోచించొద్దు..
ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో బెట్టింగులకు పాల్పడేవారిపై నిఘా పెట్టాం. ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ ల వినియోగంపై ఫోకస్ పెంచాం. యువత అత్యాశకు పోయి బెట్టింగులకు అలవాటు పడితే కష్టార్జితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈజీ ఎర్నింగ్ వైపు ఆలోచించకుండా కష్టాన్ని నమ్ముకోవాలి. ఎవరైనా బెట్టింగులకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి.
- పింగళి ప్రశాంత్ రెడ్డి, ఏసీపీ, కాజీపేట
