- హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని, ఎంపీ కావ్య
- లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి బట్టలు పెట్టిన నేతలు
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మంగళవారం రెండో దశ డబుల్ బెడ్‍రూం ఇండ్లు పంపిణీ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో పట్టాల పంపిణీ నిర్వహించారు. న్యూశాయంపేట వద్ద నిర్మించిన 608 డబుల్ ఇండ్లను ఓపెన్ లక్కీ డ్రా పద్ధతిలో లబ్ధిదారులకు అందించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‍పాయ్ డబుల్ ఇండ్ల ప్రాంతానికి వెళ్లి పలువురు లబ్ధిదారులకు కొత్త బట్టలుపెట్టి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్‍ఎస్ హయంలో పేదలకు ఇళ్లు కట్టకుండానే తెల్ల కాగితాలు చేతిలో పెట్టారని విమర్శించారు.
తమ ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నియోజకవర్గాలకు సైతం 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లిచ్చామని తెలిపారు. కేసీఆర్ పదేండ్లు డబుల్ బెడ్‍రూం ఇండ్లు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం మొదటి విడతలో రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, ఇప్పటికే1.80 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు.
వరంగల్ పశ్చిమ పరిధిలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‍ఎస్ డబుల్ ఇండ్ల నిర్మాణాలను మధ్యలో వదిలేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యే వీటి నిర్మాణాన్ని చాలెంజ్‍గా తీసుకొని ఏడాదిలో రెండు దశల్లో డబుల్ ఇండ్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. గ్రేటర్ వరంగల్‌లో దాదాపు 20 వేల మంది ఇండ్లు లేనివారు ఉన్నారని, వారికి సైతం డబుల్ ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని గ్రేటర్ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్‍పాయ్‍లకు సూచించారు.
ఈ వయసులో మాకు దక్కిన గౌరవం
వయసు పైబడ్డ మా లాంటి దంపతులకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించడం గౌరవంగా భావిస్తున్నాం. ఏండ్ల తరబడి ఇల్లు లేక అక్కడక్కడ ఉంటున్నాం. ఇల్లు కోసం దరఖాస్తు పెట్టుకున్నాం తప్పితే మా పేర్లు చెప్పే వరకు ఊహించలేదు. ఇప్పుడు మాకు ఎంతో ధైర్యం వచ్చింది. ప్రభుత్వానికి, అధికారులకు రుణపడి ఉంటం.
– దోవల్గర్ రవీందర్ -
